భూపాలపల్లి: గోదావరి పరివాహక ప్రాంతంలో నల్ల బంగారం నిక్షేపాలు భారీగా బయటపడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సుమారు 1,798.45 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గు ఉన్నట్లు సింగరేణి సంస్థ అన్వేషణ విభాగం అధికారులు ఇటీవల గుర్తించారు. అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉండటంతో ఆ శాఖ అనుమతుల కోసం సంస్థ అధికారులు ఎదురుచూస్తున్నారు. అనుమతులు వస్తే రెండు జిల్లాలు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనున్నాయి.
భారీగా బొగ్గు నిక్షేపాలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ మండలం అడవిసోమన్‌పల్లి మానేరు నుంచి తాడిచర్ల, భూపాలపల్లి, పెద్దాపూర్, మల్లయ్యపల్లి, ములుగు జిల్లా వెంకటాపురం(ఎం), రామక్రిష్ణాపూర్, గొల్లపల్లి, గోవిందరావుపేట, ఏటూరునాగారం, పస్రా వరకు భారీగా బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారి సూచనల మేరకు సింగరేణి సంస్థ అన్వేషణ విభాగం అధికారులు ఆయా ప్రాంతాల్లో డ్రిల్లింగ్ నిర్వహించగా సుమారు 1,798.45 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా అటవీ, ప్రైవేట్ భూముల్లోనే ఉన్నాయి. దీంతో అటవీ ప్రాంతాల్లో బొగ్గు వెలికితీత కోసం ఆ శాఖ అనుమతి కోరుతూ సింగరేణి యాజమాన్యం లేఖలు రాయగా ఇంకా అనుమతులు రాలేదు. అటవీశాఖ నుంచి అనుమతి వస్తే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల తరహాలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాలు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనున్నాయి.
30 ఏళ్లకు సరిపడా నిల్వలు..
జయశంకర్, ములుగు జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో 30 ఏళ్ల పాటు వెలికితీసినా సరిపడా బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు గుర్తించారు.
● భూపాలపల్లి షాఫ్ట్ ఎక్స్‌టెన్షన్ బ్లాక్ 1 ప్రాంతంలో 6.14 చదరపు కిలోమీటర్ల దూరంలో సుమారు 600 మీటర్ల లోతు 60 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ బొగ్గు నిక్షేపాల పూర్తి స్థాయి వివరాలను తెలుసుకునేందుకు 12 బోర్లు వేసేందుకు అటవీశాఖ అనుమతుల కోసం సింగరేణి సంస్థ లేఖలు రాసింది. ఇక్కడ నిక్షేపాలు ఎక్కువ లోతులో ఉండటంతో భూగర్భ గనుల ద్వారా బొగ్గును వెలికి తీయాల్సి ఉంటుంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కనుక ఈ ప్రాంతంలో గనుల ఏర్పాటుకు సింగరేణి సంస్థ వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.
● కేటీకే 8వ ఇంకై ్లన్ సమీపంలోని ములుగు జిల్లా వెంకటాపూర్ (ఎం) మండలంలోని మల్లయ్యపల్లి బ్లాక్‌లో 2.52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 600 మీటర్ల లోతులో సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు గుర్తించారు.
● తాడిచర్ల బ్లాక్ 2లో 18.75 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 350 మిలియన్ ట న్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఇక్కడ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
● జిల్లాలోని వెంకటాపురం(ఎం) ప్రాంతంలో బొగ్గు నిక్షేపాల కోసం ఆరేళ్ల క్రితం 4 డ్రిల్లింగ్ మిషన్‌లతో అన్వేషించి, 3.38 చదరపు కిలోమీటర్ల ప్రైవేట్ భూమిలో 80 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లుగా నిర్ధారించారు. 2021 మార్చి 31న సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు జియాలజికల్ రిపోర్ట్‌ను యాజమాన్యానికి అందజేశారు. అదే ప్రాంతంలోని అటవీశాఖకు చెందిన భూమిలో 6.18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 600 మీటర్ల లోతు వరకు 140 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ప్రాంతంలో 9.56 చదరపు కిలోమీటర్ల దూరంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందడంతో, ఇక్కడ బొగ్గు వెలికితీస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, ఎలా చేపట్టాలనే విషయమై సింగరేణి సంస్థ సమాలోచనలు చేస్తుంది.
● లక్ష్మిదేవిపేట, పాలంపేట, మహదేవపూర్, పెద్దాపూర్ థిక్ సీమ్, గొల్లపల్లి డిప్‌సైడ్ తదితర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లుగా సింగరేణి సంస్థ గుర్తించింది. మొత్తంగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 25 నుంచి 30 ఏళ్ల వరకు వెలికితీసేంతగా సుమారు 1,798.45 మెట్రిక్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు జిల్లాలు భవిష్యత్‌లో పారిశ్రామికంగా ఊహించని విధంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జయశంకర్, ములుగు జిల్లాలకు
బంగారు భవిష్యత్
1,798.45 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గు నిక్షేపాలు
30 ఏళ్లకు సరిపడా నిల్వలు
నిర్ధారించిన అన్వేషణ
విభాగం అధికారులు
అనుమతులు వస్తే
పారిశ్రామికంగా కొత్త వెలుగులు


