మంగపేట : మండల పరిధిలోని కమలాపురం, బోరునర్సాపురంలో తెలంగాణ రైతు విజ్ఞానకేంద్రం(ఈఆర్‌వీకే) శాస్త్రవేత్తలు వెంకన్న, విశ్వతేజ ప్రశాంత్ రైతులకు పంటల సాగు పద్ధతులు, డ్రోన్ల వినియోగం, ఎరువుల వాడకంపై శనివారం అవగాహన కల్పించారు. మండల ఇన్‌చార్జ్ ఏఓ మహేశ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న వరి, ఇతర పంటలను శాస్త్రవేత్తల బృందం ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. వరి, ఇతర ప్రధాన పంటల్లో వచ్చే తెగుళ్లు, పురుగులను గుర్తించారు. తగిన సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎం) ఆధ్వర్యంలో పంటలలో నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల ప్రాముఖ్యతపై ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించారు. వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యతపై డెమో నిర్వహించి అవగాహన కల్పించారు. కమలాపురంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ వరి రకాలను ఉత్పత్తి చేస్తున్న రైతు రాజేశ్వర్‌రావు ఆర్గానిక్ ఫామ్‌ను సందర్శించారు. రైతులు రాజేశ్వర్‌రావును ఆదర్శంగా తీసుకుని పంటలు పండించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అగ్రికల్చర్ ఆర్‌డబ్ల్యూఈపీ విద్యార్థులు రోషన్, సౌమిత్ సర్కార్, భానుప్రసాద్, గణేశ్, ఏఈఓ మహేశ్, భావన, గాయత్రి, రైతులు నవీన్‌రెడ్డి, శ్రీనివాస్, రవి, హన్మంతరావు, శ్రీను, యాదగిరి, సమ్మిరెడ్డి, కనకం, సురేశ్ పాల్గొన్నారు.


