శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

సాక్షి నెట్‌వర్క్‌ : జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ వీరస్వామి ఆధ్వర్యంలో హేమాచల క్షేత్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల్లో యాదవులు వేడుకలను నిర్వహించగా.. చిన్నారులు గోపిక, కృష్ణుడి వేషధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉత్తమ పాఠశాలగా ఎంపిక

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ.. ఆటపాటల్లోనూ తమ ప్రతిభను చాటుతున్న ఊరట్టం గిరిజన బాలికల పాఠశాల జిల్లాస్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఉత్తమ పాఠశాలగా ఊరట్టం పాఠశాలకు ఈ గుర్తింపు దక్కింది. గురువారం మంత్రి సీతక్క చేతుల మీదుగా హెచ్‌ఎం శ్రీనివాస్‌ అవార్డును స్వీకరించారు.

పోడుకొట్టేందుకు ఛత్తీస్‌గఢ్‌

గిరిజనుల యత్నం

వెంకటాపురం(కె): మండల పరిధిలోని సుడిబాక గ్రామ సమీపంలోని పిట్ట తోగు సమీపంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా గ్రామానికి చెందిన గిరిజనులు శుక్రవారం పోడు కొట్టి గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా గ్రామానికి చెందిన 35 మంది గిరిజనులు పిట్టతోగు సమీపంలో అటవీలో పోడు కొట్టి గుడిసెలు వేసుకునేందుకు యత్నించారని తెలిసి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారరు. గిరిజనులను అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పీఎస్‌లో గిరిజనులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. కాగా సుక్మాకు చెందిన గిరిజనులు గతంలో రెండు సార్లు కూడా ఇదే ప్రాంతంలో పోడు కొట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకుని పంపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

కృష్ణాలంకరణలో

భద్రకాళి అమ్మవారు

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారికి కృష్ణాలంకారం జరిపారు. అనంతరం రాత్రి 10గంటల నుం– భక్తులను దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజాము వరకు భక్తులు జాగరణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement