వెంకటాపురం(కె): పంటల సాగు వివరాలు పక్కాగా లెక్కగట్టేందుకు వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ చివరి వరకు సర్వే చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించింది. కాగా జిల్లా పరిధిలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున జిల్లా వ్యాప్తంగా 269 మందిని నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పంటల వివరాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన సెల్ ఫోన్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 1.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా.. వలంటీర్లు వివరాల నమోదులో బిజీగా మారారు.
269 మంది వలంటీర్లు
జిల్లాలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక్కరు చొప్పున 269 మంది వలంటీర్లను నియమించారు. ములుగు మండలంలో 16 మంది, మల్లంపల్లిలో 2, గోవిందరావు పేటలో 11 మంది, తాడ్వాయిలో 46 మంది, ఏటూరునాగారంలో 26 మంది, మంగపేటలో 22, వెంకటాపురం(ఎం) 9 మంది, కన్నాయిగూడెంలో 23 మంది, వాజేడులో 57 మంది, వెంకటాపురం(కె)లో 57 మంది వలంటీర్లను నియమించారు. కాగా వారు తమకు కేటాయించిన గ్రామాలో గత ఐదు రోజులుగా సర్వే చేస్తూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో శిక్షణ
యాప్ వినియోగం, పంటల సాగు నమోదు విషయాలపై వలంటీర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చారు. వలంటీర్లు గ్రామాల్లో సర్వే చేసి ప్రభుత్వం నిర్దేశించిన 45 రోజుల్లో తమకు కేటాయించిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలను ప్రతీరోజు యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
269 మంది వలంటీర్ల నియామకం
ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒకరు
పంట విస్తీర్ణం నమోదు
జిల్లాలో 1.45 లక్షల ఎకరాల సాగు


