ములుగు: జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్ర త, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా రిజిస్టర్లను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ఉండరాదని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎండీ. సలీం, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్లాంటేషన్ పరిశీలించిన సీసీఎఫ్ ప్రభాకర్
వాజేడు : మండల పరిధిలోని పేరూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌ను కాళేశ్వరం సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ గురువారం పరిశీలించారు. గ్రామ సమీపంలో 35 హెక్టార్లలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు పెంచుతుండగా మొక్కల ఎదుగుదల, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు ఎదగడానికి చేపట్టాల్సిన చర్యలతో పాటు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఆయన వెంట ములుగు డీఎఫ్‌ఓ వికాస్ మీనా, వెంకటాపుర(కె) ఎఫ్‌డీఓ ద్వాలియా, వాజేడు రేంజర్ నరేందర్, సెక్షన్ ఆఫీసర్ నారాయణ, ఎఫ్‌బీఓ పద్మ తదితరులు ఉన్నారు.
‘ఆరుతడి పంటలు
సాగుచేయాలి’
ములుగు: నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే రైతులు ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆత్మ చైర్మన్ కొండం రవీందర్‌రెడ్డి సూచించారు. మండల పరిధిలోని భూపాల్‌నగర్‌లో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో గురువారం ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన నీటి వసతిపై రైతులు ముందుగానే దృష్టి సారించాలన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టేందుకు రైతులు చిన్న నీటికుంటలను నిర్మించుకోవాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించుకోవడం ద్వారా పంటలకు అవసరమైన నీటి లభ్యతను పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు, సర్పంచ్ నాగిడి రమణారెడ్డి, మండల వ్యవసాయ అధికారి నల్లెల్ల శ్రీధర్, ఏఈఓ కావ్య, ఆత్మ సభ్యులు, ఆయిల్‌పామ్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
సాంకేతికతతో
పరిశ్రమలకు లాభాలు
ములుగు: పరిశ్రమలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టి సౌరవిద్యుత్, ఇతర హరిత సాంకేతికతలను వినియోగించుకుని నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన అభివృద్ధిని సాధించవచ్చని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్ అన్నారు. రీచ్ ఆధ్వర్యంలో ములుగులో గురువారం నిర్వహించిన ర్యాంప్, గ్రీనింగ్, ఎంఎస్‌ఎంఈఎస్ అవగాహన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. రైస్ మిల్లులతో పాటు అన్ని ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునే సాంకేతికతలను అవలంభించాలని సూచించారు. సౌర విద్యుత్ వినియోగంతో ఖర్చును తగ్గించుకోవచ్చని, తద్వారా పరిశ్రమల పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి, రీచ్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.


