గోవిందరావుపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలు కష్టాలు పడుతున్నారని బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి ఆరోపించారు. రైతు సమస్యలు, సాగునీరు, విద్యుత్, యూరియా కొరత, రైతు బీమా, రుణమాఫీ తదితర అంశాలపై గురువారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతుభరోసా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎడ్లబండిపై ప్రారంభమైన ర్యాలీ పీఎస్‌ఆర్ గార్డెన్ వరకు కొనసాగింది. అనంతరం వారు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మండలంలో లక్నవరం సరస్సు ఉన్నప్పటికీ రైతులు పంటలు సాగు చేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు. 2024లో వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లు వంటి పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్‌నాయక్, జంపన్న, వినయ్, పృథ్వీరాజ్, రవీందర్, రఘు, కృష్ణ, ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మణ్ బాబు,
బడే నాగజ్యోతి


