‘ఓవర్‌’ లోడ్‌.. భారీ మూల్యం! | - | Sakshi
Sakshi News home page

‘ఓవర్‌’ లోడ్‌.. భారీ మూల్యం!

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

క్వారీ నుంచి స్టాక్‌యార్డు వరకు.. ఓవర్‌లోడ్‌ లారీలకే సమస్య.. ఉమ్మడి జిల్లాలో ఇసుక రీచ్‌లు ఇలా..

ఇసుక లారీలో మె.టన్నుకు

అదనంగా.. రూ.2వేల మోత

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఇసుక లారీల్లో ఓవర్‌లోడ్‌కు ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఇసుక రవాణాలో నిర్ణీత సామర్థ్యానికి మించి తరలించే ప్రతీ మెట్రిక్‌ టన్ను ఇసుకకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఒకే వాహనం రెండు సార్లకు మించి ఓవర్‌లోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడితే సాండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో ఆ వాహనాన్ని తదుపరి బుకింగ్‌లకు బ్లాక్‌ చేయనున్నారు. మైన్స్‌ సర్వేలెన్స్‌ సిస్టం ద్వారా ఓవర్‌లోడ్‌ను గుర్తించి జరిమానాను ఆన్‌లైన్‌లో వసూలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్‌ 28లో స్పష్టం చేసింది.ఈ నిబంధనలతో ఉమ్మడి జిల్లాలోని రీచ్‌లనుంచి అదనపు ఇసుక తరలించే వందలాది లారీలకు చెక్‌పడనుంది.

కొన్ని రీచ్‌ల్లో నేరుగా భారీ వాహనాల్లో ఇసుక లోడ్‌ కాకుండా రీచ్‌ నుంచి స్టాక్‌యార్డుకు ట్రాక్టర్లు/చిన్న వాహనాల ద్వారా తరలించి, అక్కడినుంచి లారీల్లోకి రీలోడ్‌ చేసే విధానం ఉంది. తాడిచెర్ల తాజా టెండర్లలోనూ రీచ్‌ నుంచి స్టాక్‌యార్డుకు ఇసుక తరలించి, తిరిగి లారీల్లోకి లోడ్‌ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అందువల్ల కొత్త నిబంధన కేవలం లారీ డ్రైవర్‌పైనే కాకుండా రీచ్‌–స్టాక్‌యార్డు–లోడింగ్‌–రవాణా మొత్తం వ్యవస్థపై జాగ్రత్త పెంచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఓవర్‌లోడ్‌ పూర్తిగా నియంత్రితమైతే ఒక్క ట్రిప్పులో తరలించే ఇసుక పరిమాణం తగ్గుతుంది. మరోవైపు రోడ్లపై ఒత్తిడి, రోడ్డు నష్టం, ప్రమాదాల ముప్పు తగ్గే అవకాశం ఉంది.

కొత్త జీఓతో అసలు సమస్య ఓవర్‌లోడ్‌ చేసే లారీలకే. ఒక లారీలో నిర్ణీత పరిమితికి మించి టన్ను ఇసుక ఉంటే రూ.2వేల జరిమానా. 3 టన్నులు అదనంగా ఉంటే రూ.6వేలు, ఐదు టన్నులు అయితే రూ.10వేలు.. అంటే ఒక్క ట్రిప్పులో ఎక్కువ ఇసుక వేసుకుని అదనపు ఆదాయం పొందాలనుకునే ప్రయత్నం జరిమానాతో పోలిస్తే నష్టదాయకంగా మారే అవకాశం ఉంది. జీఓ ప్రకారం జరిమానా అదనంగా తరలించిన ఇసుక పరిమాణంపై విధించనున్నారు. లారీ యజమానులకు ఇది మరింత కీలకమైన నిబంధన. రెండుకంటే ఎక్కువ ఓవర్‌లోడ్‌ ఉల్లంఘనలు గుర్తించిన వాహనాన్ని సాండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో తదుపరి బుకింగ్‌ల నుంచి బ్లాక్‌ చేయనున్నారు. రెండు కంటే ఎక్కువ ఓవర్‌లోడ్‌ ఉల్లంఘనలు నమోదైతే ఆ వాహనంతో టీజీఎండీసీ ఇసుకను బుక్‌ చేసుకునే అవకాశమే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఉమ్మడి వరంగల్‌లోని ముఖ్యంగా ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు సాగుతున్నాయి. టీజీఎండీసీ వివరాల ప్రకారం.. ములుగు జిల్లాలో టీజీఎండీసీ రికార్డుల్లో మారికాల, సూరవీడు, ముత్తారం, కొండాపురం, కొరకల్లు వంటి ఇసుక రీచ్‌ల వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు మారికాల రీచ్‌కు1,59,680 మెట్రిక్‌ టన్నులు, కొరకల్లు రీచ్‌కు 99,948 క్యూబిక్‌ మీటర్ల పరిమాణం కేటాయించారు. సూరవీడు రీచ్‌కు 70 వేల క్యూబిక్‌ మీటర్లు, ముత్తారం రీచ్‌కు 99,400 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. జేఎస్‌ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఇసుక డీ–సిల్టేషన్‌ పనులకు టీజీఎండీసీ టెండర్లు పిలిచింది. తాడిచెర్ల–1, తాడిచెర్ల–2 రీచ్‌లలో సుమారు 14 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక డీ–సిల్టేషన్‌కు సంబంధించిన టెండర్‌ అయ్యింది. ఆయా రీచ్‌ల నుంచి ఇసుక తరలించే లారీలకు శ్రీఓవర్‌లోడ్‌శ్రీ నిబంధన ప్రభావం పడనుంది. దీంతో ఇసుక వ్యాపారుల, లారీ ఓనర్ల లెక్కలు తారుమారు కానున్నాయి.

రెండుసార్లు ఓవర్‌..

మూడోసారికి బుకింగ్‌ కట్‌

రీచ్‌ నుంచి స్టాక్‌యార్డు..

అక్కడినుంచి లారీ వరకు నిఘా

కొత్త నిబంధనలు విధించిన రాష్ట్ర

ప్రభుత్వం

తారుమారు కానున్న వ్యాపారుల లెక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement