పోచమ్మకు బోనాలు | - | Sakshi
Sakshi News home page

పోచమ్మకు బోనాలు

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

ఏటూరునాగారం: మండల కేంద్రంలో పోచమ్మతల్లి బోనాల పండుగను ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఇంటి వద్ద నుంచి బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తుల నృత్యాలతో మహిళలు పోచమ్మ తల్లి గుడికి చేరుకుని మొక్కులు సమర్పించారు. ముందుగా బొడ్రాయికి తొలి మొక్కులు చెల్లించి, కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలను సమర్పించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

నేడు మంత్రి పర్యటన

ఏటూరునాగారం: నేడు(గురువారం) మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు దేవులపల్లి విజయ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ ఫంక్షన్‌హాల్‌లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టుమిషన్‌ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

అదనపు కలెక్టర్‌

ఆకస్మిక తనిఖీ

కాళేశ్వరం(మల్హర్‌): మల్హర్‌ మండలం నాచారం గ్రామపంచాయతీని అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆన్సన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఫాంపాండ్‌ పనులను సందర్శించి కూలీలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్‌, హౌసింగ్‌ డీఈ శ్రీకాంత్‌, ఏఈ రజినీకాంత్‌, ఎంపీఓ మల్లికార్జున్‌, ఏపీఓ గిరి హరీశ్‌ పాల్గొన్నారు.

మలేషియాలో

ఉద్యోగాలకు అవకాశం

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ, తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మలేషియాలో వివిధ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియాలో అందుబాటులో ఉన్న ఉద్యోగాల్లో హౌస్‌ వర్కర్‌, పైప్‌ ఫిట్టర్‌, స్వీపర్‌, కుక్‌, ఎక్స్కవేటర్‌–బ్యాక్‌హో ఆపరేటర్‌ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు అర్హులని అన్నారు. అభ్యర్థుల వయస్సు 20నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు. నైపుణ్యం కలిగిన వారికి నెలకు రూ.40వేల నుంచి రూ.47వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు వసతి, ఇతర సౌకర్యాలు నిబంధనల ప్రకారం ఉంటాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం టీఓఎంసీఓఎం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని లేదా 080 35524946 నంబర్‌లో వివరాలు తెలుసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు.

నిబంధనల మేరకు

షాపులు నిర్వహించాలి

గణపురం: ప్రభుత్వ నిబంధనల మేరకు మెడికల్‌ షాపులు నిర్వహించాలని జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పావని ఆదేశించారు. బుధవారం గణపురం మండలకేంద్రంలో పలు మెడికల్‌ షాపులను ఆమె తనిఖీ చేశారు. షాపులలో మందులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్హత కలిగిన ఫార్మసిస్టులు మెడికల్‌ దుకాణాలలో ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే మందుల విక్రయాలు చేయాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు చేస్తున్నారన్నా విషయం తెలుసుకున్న పలువురు మందుల షాపులను మూసివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement