ములుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో వైఎస్సార్ వర్ధంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తెలుగు రాష్ట్రాల చరిత్రలో సంక్షేమ స్వర్ణయుగంగా నిలిచిపోయిందన్నారు. 2004 నుంచి 2009 వరకు ఆయన పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 అత్యవసర సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, రూ.2లకే కిలో బియ్యం, వృద్ధాప్య పింఛన్లు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పంచాయతీరాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవానన్‌రెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క


