మంగపేట: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను సందర్శించి బోధనా విధానాన్ని పరిశీలించారు. పాఠశాలలో అందుతున్న విద్యా సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాప్రమాణాల పెంపు, విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యం, ప్రయోగాత్మక బోధన తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు పాఠశాల యూనిఫాం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్ ఎంఈఓ పొదెం మేనక, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వెంకటస్వామి, ఉల్లాస్ కోఆర్డినేటర్ కృష్ణబాబు, జీసీడీఓ రజిత పాల్గొన్నారు.
18 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ములుగు: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, బండారుపల్లిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, బాలికల వసతిగృహంలో ఖాళీగా ఉన్న 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు జిల్లా వాసులై ఉండాలని తెలిపారు. ఏఎన్‌ఎం పోస్టుకు ఇంటర్‌తో పాటు ఏఎన్‌ఎం శిక్షణ, ప్రధాన వంటమనిషికి పదో తరగతితో వంట అనుభవం, వాచ్‌మెన్ పోస్టులకు పదో తరగతి, సహాయ వంటమనిషి, పారిశుద్ధ్య సిబ్బందికి ఏడో తరగతి ఉత్తీర్ణత ఉండాలని వెల్లడించారు. దరఖాస్తులను సంబంధిత ఎంఈఓ కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని వివరించారు. పూర్తి వివరాలకు బాలికల విద్యాభివృద్ధి అధికారి బి. రజితను సెల్ నంబర్ 9666294715లో సంప్రదించాలని డీఈఓ సూచించారు.
డీఈఓ సిద్ధార్థరెడ్డి


