సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026
‘రామప్ప’ చరిత్ర గొప్పది..
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతం అందాలను వీక్షించి సమీపంలోని చిలుకల పార్కులో పిల్లలతో కలిసి సందడి చేశారు. బొగత జలపాతం అందాలను సెల్ కెమెరాల్లో బంధించడంతో పాటు వీడియోలను తీసుకుంటూ ఆనందంగా గడిపారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా జంపన్నవాగుకు చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం(బెల్లం), చీర సారె, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శనం అనంతరం భక్తులు అటవీ ప్రాంతంలో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప ఆలయం చరిత్ర ఎంతో గొప్పదని పలువురు పర్యాటకులు కొనియాడారు. ఈ మేరకు ఆదివారం దేవాలయాన్ని జర్మనీ దేశస్తులు కేబ్లిజ్ యంగ్, యులిస్టేయింబ్, చీకో స్టాన్‌లు సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంట ప్రతాప్ కుటుంబ సమేతంగా రామప్పను సందర్శించారు. వారికి అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్రను గైడ్ విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించారు.
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్‌కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిలతైలాభిశేకం పూజలను జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. మూడు గంటల పాటు వేచి ఉండి భక్తులు స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు.
వనదేవతలకు మొక్కులు


