ప్రమాదకరంగా మూలమలుపులు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా మూలమలుపులు

Aug 31 2026 1:20 AM | Updated on Aug 31 2026 1:20 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లా పర్యాటక ప్రాంతాలకు నెలవు. నిత్యం పర్యాటకులు వివిధ వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటింది పస్రా నుంచి ఎస్‌ఎస్‌తాడ్వాయి వరకు గల 163 జాతీయ రహదారిపై మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి. పస్రా నుంచి తాడ్వాయి వరకు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు. పస్రా నుంచి తాడ్వాయి వరకు ఉన్న సుమారు 17 కిలోమీటర్ల రహదారిలో ప్రమాదకరంగా ఐదు మలుపులు ఉండడంతో ఇరుకై న రహదారి, భారీ వాహనాల రాకపోకలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జలగలంచ బ్రిడ్జి సమీపంలోని మూలమలుపులు మృత్యు మలుపులుగా మారాయి.

రాత్రివేళల్లో దారుణం..

రాత్రి వేళల్లో మూలమలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో ఒక్కసారిగా బ్రేకులు వేసే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రాత్రివేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని వాహనదారులు చెబుతున్నారు. వేగంగా వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలతో చిన్నపాటి పొరపాటు జరిగినా ప్రాణాల మీదకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలగలంచ బ్రిడ్జి సమీపంలోని ప్రమాదకర మలుపుల వద్ద గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు వాహనదారులు మృత్యువాతపడిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల వరంగల్‌ జిల్లా మార్కెటింగ్‌ అధికారి సురేఖ కారును ఇసుక లారీ ఢీ కొట్టడంతో సురేఖతో పాటు కారు డ్రైవర్‌ విజయబాబు మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా ఇటీవలన అదే మూలమలుపు వద్ద మొక్కలతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి బొల్తా పడింది. దీంతో ఈ రహదారి ప్రమాదకర పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది.

భయంభయంగా..

నేషనల్‌ హైవే హనుమకొండ నుంచి పస్రా వరకు ప్రయాణం సాఫీగా సాగినా పస్రా దాటిన తర్వాత తాడ్వాయి వరకు 17 కిలోమీటర్ల ప్రయాణం వాహనదారులకు పరీక్షగా మారుతోంది. ఎక్కడ ఏ వాహనం ఎదురవుతుందో, ఏ మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉందోనన్న భయంతో నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు సైతం రహదారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదాలు జరుగుతున్నా చర్యలేవీ?

ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రహదారి మలుపుల వద్ద రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడం, రక్షణ గోడలు నిర్మించడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అవసరమైన చోట రహదారిని విస్తరించడంతో పాటు భారీ వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.

పస్రా నుంచి తాడ్వాయి వరకు

ప్రమాదకరం

17 కిలోమీటర్లు.. ప్రతిక్షణం భయమే

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

పట్టించుకోని ఉన్నతాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement