భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల 24 డిమాండ్లపై యాజమాన్యంతో సానుకూల ఒప్పందాలు కుదరడం ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఏరియాలోని కొమురయ్య భవన్‌లో అదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 నుంచి పెండింగ్‌లో ఉన్న పెర్క్స్‌పై ఆదాయపు పన్ను రీఫండ్ సాధించామని, దీనివల్ల ఒక్కో కార్మికుడికి ఏడాదికి సుమారు రూ.35వేల ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 2027 ఏప్రిల్‌లో ఈ మొత్తం ఖాతాల్లో జమ అవుతుందన్నారు. సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు అదనంగా రూ.20 లక్షలు అందించేలా అంగీకారం కుదిరిందన్నారు. మృతుల పిల్లలకు సూటబుల్ ఎంప్లాయ్‌మెంట్, 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఓసీ పరిష్కారం, కట్ అయిన ఇంక్రిమెంట్ల పునరుద్ధరణ, క్యాడర్ స్కీమ్‌ల అమలు, క్లర్క్, సెక్యూరిటీ పోస్టుల పరీక్షలను రెండు నెలల్లో నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు.


