హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాయంలో శ్రావణపౌర్ణమి అమ్మవారికి పవిత్రోత్సవం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని సందర్శించారు ప్రధానార్చకులు భద్రకాళి శేషు అధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తికి అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు రక్షాకంకణాలు అందించారు.
తాతయ్య ఫొటోకు రాఖీ
వాజేడు: తాత ఫొటోకు రాఖీ కట్టి ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటుంది ఓ మనుమరాలు. మండల కేంద్రానికి చెందిన నిశ్విత తాత విరాట్ మూర్తి ఆరేళ్ల క్రితం మృతిచెందారు. ఆయనపై ఉన్న అభిమానంతో మనుమరాలు శ్రీజ అతని ఫొటోకు రాఖీ కట్టేది. అయితే గత ఏడాది శ్రీజ వివాహం కావడంతో ఈసారి శ్రీజ సోదరి నిశ్విత విరాట్ మూర్తి ఫొటోకు రాఖీ కట్టి సంప్రదాయాన్ని కొనసాగించింది.
వాహనాల
బహిరంగ వేలం
ములుగు: ములుగు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల వేలం ఆగస్టు 31న స్టేషన్ ఆవరణలో నిర్వహించనున్నట్లు ములుగు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు వాహనాల ధరలో 50 శాతం మొత్తాన్ని దరావత్తుగా చెల్లించాలని తెలిపారు. వేలంలో వాహనం దక్కించుకున్న వారు అదే రోజు మిగిలిన మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని తెలిపారు. స్క్రాప్ వాహనాలను కట్ చేసి మాత్రమే తరలించాలని, వేలంలో వాహనం పొందిన వారు నిబంధనల ప్రకారం జీఎస్టీని చెల్లించాలని స్పష్టం చేశారు. వాహనాల వేలం ఆగస్టు 31న ఉదయం 10.30లకు భూపాలపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సమక్షంలో నిర్వహించనున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
కొడుకుతో గొడవపడి
తండ్రి ఆత్మహత్య
ఏటూరునాగారం: కుమారుడితో గొడవపడి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏటూరునాగారంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తుమ్మ రమేష్ (50) భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. స్థానిక బస్టాండ్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన రమేష్.. ఈనెల 27న తన కుమారు డు మహేష్‌తో గొడవ పడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. శుక్రవారం వరకు ఇంటికి రాకపోవడంతో జంపన్నవాగు సమీపంలో వెతకగా చెట్టుకు ఉరివేసుకొని మృతిచెంది కనిపించాడు. మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విచారణ చేపట్టి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.
ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికుల చేరవేత
హన్మకొండ: రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు నడిపినట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులు సమకూర్చి వారిని గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. ఈ నెల 26న 84 ప్రత్యేక బస్సులు నడుపడం ద్వారా దాదాపు 4,27,281 మంది ప్రయాణికులను, 27న 152 ప్రత్యేక బస్సుల ద్వారా 5,16,877 మంది, 28న 150 ప్రత్యేక బస్సుల ద్వారా 6 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. రాఖీ వేడుకలు ముగించుకుని తిరిగి తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తగినన్ని బస్సులను తిప్పనున్నామని పేర్కొన్నారు.


