● రూ.36 లక్షలు మంజూరు
● ఆయిల్‌పామ్, మిర్చి,
కూరగాయల సాగుకు ప్రోత్సాహకం
ఏటూరునాగారం: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతో జిల్లాలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి రావడానికి, పంటలను కాపాడుకోవడానికి స్ప్రింక్లర్ పరికరాలతోపాటు మల్చింగ్ కవర్లు, చిన్ననీటి కుంటలను రైతులు వినియోగించుకునేందుకు ప్రభుత్వం రాయితీ విధానం ప్రవేశపెట్టింది. మిర్చి, ఆయిల్ పామ్, కూరగాయలు, మల్బరి, పండ్ల తోటలకు డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్ పరికరాలను రాయితీపై అందిస్తుంది.
8,417 మందికి అందజేత
హార్టీకల్చర్ సాగుకు రైతులకు ప్రభుత్వం రాయితీ అందజేస్తుంది. 2026 జనవరి వరకు జిల్లాలో 8,417 మంది రైతులకు 7,930 హెక్టార్లలో రూ.56.13 కోట్లతో బిందు సేద్యం, తుంపర్ల సేద్యం పరికరాలను రాయితీపై అందించింది. దీంతో తక్కువ నీటితో ఎక్కువ పంటలు దిగుబడి సాగు అవుతున్నాయని ప్రభుత్వం వచ్చే ఏడాదికి కూడా మరిన్ని యూనిట్లకు నిధులు కేటాయించింది. 2026–27 సంవత్సరానికిగాను 212 ఎకరాల్లో రూ.36 లక్షల విలువైన బిందు సేద్యం పరికరాలకు కలెక్టర్ మంజూరు ఇచ్చారు. దీనిద్వారా మరికొంత మందికి డ్రిప్ పరికరాలు అందనున్నాయి.
ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం రాయితీ
ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం రాయితీతో డ్రిప్ యూనిట్‌ను మంజూరు చేయనున్నారు. 5 ఎకరాలలోపు సన్న, చిన్న కారు రైతులకు, ఇతర రైతులకు 80 శాతం రాయితీ అందించనుంది. 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు 70 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలను అందించడానికి ప్రభుత్వం ఆసక్తి గల రైతుల నుంచి దరఖాస్తులు కోరింది. స్ప్రింకర్లు(తుంపర సేద్యం) పరికరాలపై అన్ని వర్గాల రైతులకు 65 శాతం రాయితీ ఉంది. ఆసక్తిగల రైతులు సమీప ఉద్యాన అధికారి, లేదా జిల్లా ఉద్యాన అధికారి కార్యాలయంలో సంప్రదించాని ఇతర వివరాల కోసం 77801 32284, ఉద్యానవన అధికారి ఏటూరునాగారం 77023 83263, జిల్లా కార్యాలయం 89777 14067 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


