ములుగు రూరల్: ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కరాటే పోటీలలో జగ్గన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారని హెచ్‌ఎం విజయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పతకాలు సాధించిన విద్యార్థినులను కోచ్ అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం విజయలక్ష్మీ మాట్లాడుతూ న్యూఢిలీలో ఈనెల 7నుంచి 9వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కరాటే పోటీలు నిర్వహించారని తెలిపారు. పాఠశాలకు చెందిన నిహారిక 47 కేజీల విభాగంలో కాంస్య పతకం, అవంతిక సబ్ జూనియర్ పోటీల్లో 37 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. బాలికల ఆత్మరక్షణకు కరాటే పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. విద్యార్థినులను కరాటే పోటీలలో రాణించేలా తీర్చిదిద్దిన కోచ్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


