గ్రామస్తులకు అండగా ఉంటాం..
వెంకటాపురం(కె): గ్రామస్తులకు ఎలాంటి సహాయం కావాలన్నా.. పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బర్లగూడెం పంచాయతీ పరిధిలోని కర్రిగుట్టలో ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతం పామునూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎప్పులు ఎలాంటి సహాయం కావాలన్నా.. పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించవచ్చునన్నారు. అనంతరం చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ఆయన వెంట ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, సిబ్బంది ఉన్నారు.
వసతులు మెరుగ్గా ఉండాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరలో బందోబస్తు కోసం వచ్చే పోలీసు సిబ్బందికి వసతి సౌకర్యాలు మెరుగ్గా కల్పించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మంగళవారం మేడారంలో జాతరకు బందోబస్తు కోసం విధులు నిర్వర్తించే అధికారులకు, సిబ్బంది కోసం ఏర్పాటు చేస్తున్న స్థలాలను పరిశీలించారు. సిబ్బందికి ఎలాంటి లోటు రాకుండా చూడాలని నిర్వాహణాధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ రవీందర్, సీఐలు దయాకర్, శంకర్ తదితరులు ఉన్నారు.
చట్ట వ్యతిరేకంగా సంబురాలు చేస్తే చర్యలు
ములుగు రూరల్: నూతన సంవత్సర వేడుకలు చట్ట వ్యతిరేకంగా సంబురాలు చేపడితే శాఖ పరమైన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ప్రతీఒక్కరి జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలు భద్రత నియమాలు పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో
పర్యటన


