ఎట్టకేలకు రోడ్డు పనులు
ఏటూరునాగారం: మేడారం జాతర సందర్భంగా మండలంలోని కొండాయి వద్ద ఎట్టకేలకు రోడ్డు పనులు చేపట్టారు. ఇప్పటికే కొండాయి బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్ తన మిషనరీ తరలించేందుకు, పనులు చేపట్టేందుకు రోడ్డు నిర్మించాడు. జాతర సందర్భంగా మంజూరైన రూ. 60 లక్షలతో మరో రెండు రోడ్లను నిర్మించేందుకు ఆదివారం పనులు ప్రారంభించాడు. మేడారం జాతర భక్తులు ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలను సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు జాతరకు వారం ముందుగానే చేయాలని ఆదేశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పైపులు సిద్ధం చేసి ఉంచారు. వాటిపై నుంచి మట్టి, ఇసుక బస్తాలతో తాత్కాలిక రోడ్డును నిర్మించనున్నారు.


