త్వరలో మున్సిపల్ పోరు..!?
పుర’పీఠాలపై
ప్రధాన పార్టీల గురి...
ఉమ్మడి వరంగల్‌లో
మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు..
ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలు
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు
సాక్షిప్రతినిధి, వరంగల్ :
మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందనుకున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్‌ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్‌లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది.
ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు...
2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా. 25న ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తొమ్మిది మున్సిపాలిటీల పాలకవర్గానికి ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న తొమ్మిది మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్‌లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌లతో పాటు ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీలలో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలలోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి.
మున్సిపాలిటీ జనాభా వార్డులు(2011 ప్రకారం)
పరకాల 24,444 22
నర్సంపేట 37070 24
వర్ధన్నపేట 13,732 12
మహబూబాబాద్ 68,935 36
డోర్నకల్ 14,425 15
మరిపెడ 17,685 15
తొర్రూరు 19,100 16
భూపాలపల్లి 59,458 30
జనగామ 52,712 30
జనవరి చివరి వారంలో
షెడ్యూల్‌కు అవకాశం
మంత్రులతో సీఎం రేవంత్
సమాలోచనల్లో చర్చ
ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు
9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి
కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన
ఈసారి కొత్తగా
మరో మూడు మున్సిపాలిటీలు
మున్సిపాలిటీ జనాభా వార్డులు
ములుగు 16,535 20
స్టేషన్‌ఘన్‌పూర్ 23,485 18
కేసముద్రం 18,480 16
త్వరలో మున్సిపల్ పోరు..!?


