పెసా మహోత్సవానికి పూసూరు సర్పంచ్
వాజేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నిర్వహించిన పెసా మహోత్సవ సభకు హాజరైనట్లు మండల పరిధిలోని పూసూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ దబ్బకట్ల సుమన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని 10 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు ఈ సభకు హాజరైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల జీవన విధానం, గ్రామ పంచాయతీల పాలన, పెసా చట్టం అమలు తదితర అంశాలపై చర్చ సాగినట్లు వివరించారు. గిరిజనుల సంస్కృతీ, సంప్రదాయాలు, పూర్వ కాలపు ఆటలు, విశిష్టత, సాంస్కృతిక వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ములుగు రూరల్: ఇండియన్ లీగల్ ప్రొపెషనల్ అసోసియేషన్ (ఐఎల్‌పీఏ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జిల్లా కోర్టు న్యాయవాది రంగోజు భిక్షపతి ఎన్నికయ్యారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎన్నికై నట్లు భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తన ఎన్నికకు సహకరించి బాధ్యతలు అప్పగించిన ఐఎల్‌పీఏ జాతీయ కమిటీ నాయకుల ఆదేశాల మేరకు న్యాయసేవా కార్యక్రమాల్లో పాల్గొని ఐఎల్‌పీఏ బలోపేతానికి కృషి చేస్తానని భిక్షపతి తెలిపారు.
ములుగు రూరల్: మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేసి ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టు కొయ్యడ సాంబయ్యను జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మంగళవారం గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి సాంబయ్య వస్తున్న క్రమంలో గట్టమ్మ ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ముంజాల భిక్షపతి, బొచ్చు సమ్మయ్య, మడిపెల్లి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.
వాజేడు: ఏజెన్సీలో జెమిని, విల్ట్ వైరస్ మిర్చి రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. మిర్చి తోటలను తెగుళ్లు పట్టి పీడిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మండల పరిధిలోని పాయబాటలు గ్రామానికి చెందిన దాట్ల కాళికృష్ణ 6 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాడు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.2 లక్షల వరకు ఖర్చు చేయగా తోట కాపుకొచ్చింది. ఈ సమయంలో తోటల్లోకి జెమిని (కుచ్చు ముడుత), విల్ట్ వైరస్ వచ్చి చేరడంతో భూమిలో వేర్లు బూజు పట్టి మొక్కలు ఎండి పోయి ఆకులు మొత్తం రాలి చని పోతున్నాయని కాళికృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెమిని వైరస్ సోకిన తోటల్లో మొక్కల ఆకులు ముడుచుకుని ఎదగడం లేదని వివరించారు. ఇప్పటి వరకు మిర్చి పంట సాగుకు రూ. 12 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా పంటను కాపాడుకోలేక పోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు.
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆవిర్భావ వేడుకలను యాజమాన్యం నామమాత్రంగా నిర్వహించడం పట్ల నల్ల బ్యాడ్జీలు ధరించి వేడుకలను బహిష్కరించినట్లు ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి ఆవిర్భావ వేడుకలను సింగరేణి యాజమాన్యం నామమాత్రంగా నిర్వహించడం కార్మికులను, సింగరేణిని అవమానించినట్లేనని గుర్తు చేశారు. యాజమాన్యం ఇలాంటి ధోరణి మానుకొని రాబోయే రోజుల్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రామచందర్, సుధాకర్ పాల్గొన్నారు.
పెసా మహోత్సవానికి పూసూరు సర్పంచ్
పెసా మహోత్సవానికి పూసూరు సర్పంచ్


