‘ఎత్తు బంగారం’ సేకరించేదెలా?
బెల్లం సేకరణలో కొరవడిన స్పష్టత
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరలో భక్తులు సమర్పించనున్న ఎత్తు బంగారం సేకరణ విషయంలో కార్యాచరణ కరువైంది. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణంతో పాటు సమ్మక్క– సారలమ్మ గద్దెల చుట్టూ రాతి స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణ పనులు బాగానే ఉన్నప్పటికీ ఈసారి జాతరలో భక్తులు సమర్పించనున్న ఎత్తు బంగారం(బెల్లం) సేకరణ పూజారులకు పెద్ద సమస్యగా మారనున్నట్లు ఆదివాసుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పదుల వరుసలో క్యూలైన్ల ఏర్పాటుతో
తప్పని తిప్పలు
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు మేడారంలో నాలుగు రోజులు సాగే మహాజాతర సందర్భంగా భక్తులు ఎత్తు బంగారం, ఒడిబియ్యం సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుటుందని ఆదివాసీ సంఘాల నాయకులు, భక్తుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూతన గద్దెల పునర్నిర్మాణంతో పాటు ఈసారి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పదుల వరుసలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునే విధంగా క్యూలైన్లు నిర్మించనున్నారు. క్యూలైన్లలో పదుల సంఖ్యలో వచ్చే భక్తులు ఎత్తు బంగారం, ఒడిబియ్యం సమర్పించేందుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని భక్తులు చర్చించుకుంటున్నారు. క్యూలో ముందు వరుసలో గద్దెల వైపు ఉన్న భక్తులు ఎత్తు బంగారం చెల్లించడం సులువుగా ఉంటుంది. వెనుకాల, అవతలి వైపు క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎత్తు బంగారం సమర్పించడం ఇబ్బందిగా మారడంతో పాటు భక్తుల మధ్య తోపులాట కూడా జరిగే ఆస్కారం ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు.
పూజారులకే బెల్లం సేకరణ బాధ్యత?
ఈసారి ఎత్తు బంగారం సేకరించే బాధ్యతను అధికారులు పూజారులకే పూర్తి బాధ్యత అప్పగించనున్నట్లు తెలుస్తుంది. గద్దెల లోపల పూజారులు ఉండకుండా గద్దెల బయట క్యూలైన్ వద్ద అందుబాటులో ఉండి భక్తుల సమర్పించే ఎత్తు బంగారాన్ని సేకరించి భక్తులకు ప్రసాదంగా బెల్లం పంచి పెట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రతిఏటా పూజారులు గద్దెలపై భక్తులు సమర్పించిన ఎత్తు బంగారాన్ని పూజారులు సేకరిస్తుంటారు. ఈసారి గద్దెలపై బెల్లం, ఒడిబియ్యం విసిరేయడం భక్తులకు సాధ్యం కాదు. ఒక వేళ భక్తులు భక్తిభావంతో విసిరేసినా రాతి స్తంభాలకు తగిలి తిరిగి భక్తులపై పడే ప్రమాదం ఉంటుందనే విషయాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. పూజారులు జాతర సమయంలో వందల సంఖ్యలో వలంటీర్లను ఏర్పాటు చేసి క్యూలైన్లలో వచ్చే భక్తుల నుంచి గద్దెల వద్ద బెల్లం పొగు చేసుకుని ఎప్పటికప్పుడు బయటకు తరలించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీ చర్యలు తీసుకుంటేనే తరలింపు సాధ్యమవుతుందని ఆదివాసీలు, భక్తులు సూచనలు చేస్తున్నారు.
మేడారంలో వనదేవతల గద్దెల చుట్టూ రాతి స్తంభాల ఏర్పాటు
మహాజాతరలో భారీగా ఎత్తుబెల్లం సమర్పించనున్న భక్తులు
పూజారులకు సమస్యగా మారనున్న సేకరణ
మేడారం జాతరలో అమ్మవార్లకు ఎత్తు బంగారం మొక్కుగా భక్తులు భారీ మొత్తంలో సమర్పిస్తుంటారు. గతేడాది జాతర వరకు భక్తులు నేరుగా అమ్మవార్ల గద్దెలపై ఎత్తు బంగారం సమర్పించే వారు. ఈ క్రమంలో గద్దెలపై సమర్పించిన ఎత్తు బంగారాన్ని పూజారులు వలంటీర్ల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు బయటకు తరలించే వారు. ఈ సారి గద్దెల విస్తర్ణతో పాటు చుట్టూ రాతి స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ సారి భక్తుల తీసుకొచ్చి వనదేవతలకు సమర్పించే బెల్లం సేకరణ విషయంలో అధికారుల్లో స్పష్టత కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


