83.88
శాతం పోలింగ్
ముగిసిన మూడో విడత పంచాయతీ పోరు
ములుగు: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి బుధవారంతో ముగిసింది. 9 మండలాల పరిధిలోని 146 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ గత నెల 26న విడుదల అయింది. మొదటి, రెండో విడతలో 100 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 24 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 76 పంచాయతీలకు ఈ నెల 11, 14 తేదీలలో ఎన్నికలు రెండు విడతల్లో జరిగాయి. మూడో విడత ఎన్నికలు బుధవారం కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లోని 45 పంచాయతీలకు జరిగాయి. ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. ఏజెన్సీ ప్రాంతంలోని మూడు మండలాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో సైతం ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఎప్పటికప్పుడు మూడు మండలాల్లో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తూ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులకు సలహాలు, సూచనలు అందిస్తూ ఎన్నికలు విజయవంతం అయ్యేలా కృషి చేశారు.
అత్యధిక ఓటింగ్ వాజేడులో..
అత్యల్పం వెంకటాపురం(కె)లో..
జిల్లాలోని మూడు మండలాల పరిధిలో 83.88 శాతం పోలింగ్ నమోదు కాగా కన్నాయిగూడెం మండలంలో 82.87శాతం, వాజేడు మండలంలో 86.30 శాతం, వెంకటాపురం(కె) మండలంలో 82.40 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వాజేడు మండలంలో పోలింగ్ శాతం నమోదు కాగా, వెంకటాపురం(కె) మండలంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.
కాలినడకన పోలింగ్ కేంద్రాలకు..
ఏజెన్సీలోని మూడు మండలాల్లో సుమారు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. పెనుగోలు, బొల్లారం, మండపాక, కలిపాక, పెంకవాగు, సీతారాంపురం, ముత్తారం, సర్వాయి, మల్కపల్లి, భూపతిపురం ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.
చలిని సైతం లెక్కచేయకుండా వచ్చిన ఓటర్లు
బుధవారం తెల్లవారుజామునుంచి పొగమంచు కురియడంతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటర్లు ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం 9 గంటల తర్వాత ఓటర్ల రద్దీ విపరీతంగా పెరిగింది. కన్నాయిగూడెం మండలంలో 9,151 మంది ఓటర్లకు 7,576 మంది ఓటు వేశారు. వెంకటాపురం(కె) మండలంలో 25,336 మందికి 20,539 మంది, వాజేడు మండలంలో 19,431 మందికి 16,398 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను అధికారులు వెల్లడించారు. ముందుగా వార్డు మెంబర్ల ఫలితాలను వెల్ల డించి, తర్వాత సర్పంచుల ఫలితాలను అధికారులు వెల్లడించారు. అనంతరం మెజార్టీ వార్డు సభ్యులు కలిసి ఉప సర్పంచులను ఎన్నుకున్నారు.
ట్రాక్టర్లలో వచ్చి ఓటు వేసి..
వెంకటాపురం(కె) మండలంలోని కలిపాక, తిప్పాపురం, ముత్తారం, పెంకవాగు, సీతారాంపురం గ్రామాలకు చెందిన ఓటర్లు 6కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలుబాక పంచాయతీ కేంద్రానికి ట్రాక్టర్లలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండాపురం, బోదాపురంలో టెంట్ కింద పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మూడు మండలాల్లోని
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
సమస్యాత్మక ప్రాంతాల్లో
ప్రశాంతంగా పోలింగ్
83.88
83.88
83.88


