హస్తం జోరు
మూడు విడతల్లోనూ
కాంగ్రెస్‌దే పైచేయి..
మూడు విడతల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు
ములుగు: పల్లెపోరులో హస్తం పార్టీ జోరు కొనసాగింది. మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కై వసం చేసుకుంది. మంత్రి సీతక్క చేసిన అభివృద్ధితో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు. జిల్లాలో 9 మండలాల్లోని 146 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 102, బీఆర్‌ఎస్ 32, సీపీఎం 1 స్థానాన్ని, ఇతరులు 11 స్థానాలను గెలుచుకున్నారు. ప్రతి విడతలోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు. అదే విధంగా జిల్లాలోని 146 జీపీల్లో 25 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా అందులో 24 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఉండడం గమనార్హం.
22న ప్రమాణ స్వీకారం
ఈ నెల 22న నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తొలుత ఈనెల 20న కొత్త సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ముహుర్తాలు లేకపోవడంతో వారి అభ్యర్థన మేరకు 22న ప్రమాణ స్వీకారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేండేళ్ల విరామం లోపే నూతన సర్పంచులు బాధ్యతలు తీసుకోనున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ
మూడు మండలాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో సర్పంచులుగా విజయం సాధించడంతో విజయోత్సవాల్లో మునిగి తేలారు. గెలిచిన అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చడంతో పాటు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా సాగిన మూడు విడతల్లోని పల్లెపోరులో కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగింది. తొలి విడతలో జరిగిన 48 పంచాయతీ ఎన్నికల్లో 36 కాంగ్రెస్, 11 బీఆర్‌ఎస్, ఇతరులు ఒక స్థానాన్ని కై వసం చేసుకున్నారు. రెండో విడతలో జరిగిన 52 పంచాయతీలకు కాంగ్రెస్ 37, బీఆర్‌ఎస్ 13, ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు. మూడో విడతలో 46 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 29, బీఆర్‌ఎస్ 8, ఇతరులు 8, సీపీఎం 1 స్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ప్రతీ విడతల్లో అధికార పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక జోష్ సంతరించుకుంది.
వెనుకబడిపోయిన బీఆర్‌ఎస్ అభ్యర్థులు
22న ప్రమాణ స్వీకారం చేయనున్న సర్పంచులు
సంబురాల్లో కాంగ్రెస్ శ్రేణులు


