పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
ములుగు: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ ఎన్నికల వివరాలను వెల్లడించారు. మూడో విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైందన్నారు. వాజేడులో విపరీతమైన మంచు కురిసినప్పటికీ చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులుదీరారని వెల్లడించారు. వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు మండలాల పరిధిలో ఓటింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. మూడో విడతలో సాగిన పంచాయతీ పోరులో 46 సర్పంచ్ స్థానాలకు ఒకటి ఏకగ్రీవ కాగా మిగిలిన 45 సర్పంచ్ స్థానాలకు, 329 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు వెల్లడించారు. మొత్తం మూడు విడతల్లో సాగిన పోరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయించామని, వెబ్ కాస్టింగ్‌తో పాటు మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి, పోలీస్ యంత్రాంగానికి, పాత్రికేయులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


