కుష్ఠువ్యాధి నిర్మూలనకు పాటుపడాలి
ములుగు రూరల్: కుష్ఠువ్యాధి నిర్మూలనకు పాటుపడాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో కుష్ఠువ్యాధిగ్రస్తుల గుర్తింపుపై వైద్య సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఐకమత్యంతో పనిచేసి జిల్లాను కుష్ఠ్టువ్యాధి రహిత జిల్లాగా మార్చాలని సూచించారు. కుష్ఠువ్యాధిపై సమాజంలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్చంధ సంస్థలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసినప్పుడే కుష్ఠువ్యాధి సమగ్ర నివారణ సాధ్యమవుతుందని వెల్లడించారు. కుష్ఠ్టువ్యాధి మైకో బ్యాక్టీరియా సూక్ష్మ క్రిమి ద్వారా వచ్చే సాధారణ వ్యాధి అన్నారు. దీనిని ఎండిటి చికిత్సతో నయం చేయవచ్చని వివరించారు. పీహెచ్‌సీల్లో మందులు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం జిల్లా టీబీ, ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ మాట్లాడుతూ జిల్లాలో 487 టీంలను ఏర్పాటు చేశామని వివరించారు. రేపటి నుంచి 31వ తేదీ వరకు టీంల పర్యటన సాగుతుందని వివరించారు. కార్యక్రమంలో డీపీఎంఓ సంజీవరావు, పవన్‌కమార్, శ్రీకాంత్, ఏఎంఓ దుర్గారావు, ఎస్‌ఓ స్వరూపరాణి, సురేష్‌బాబు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు


