జనావాసాల మధ్య సెల్‌టవర్ వద్దు
● ఆగ్రహంతో రోడ్డెక్కిన స్థానికులు
గోవిందరావుపేట : జనావాసాల మధ్య సెల్‌టవర్ నిర్మించొద్దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఓ వైపు గుడి, మరోవైపు పాఠశాలలు ఉండగా వాటి నడుమ సెల్ టవర్ నిర్మాణానికి ప్రయత్నించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రేడియేషన్ వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలను టవర్ కంపెనీ విస్మరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థాని కుల కథనం ప్రకారం.. టవర్ నిర్మాణం చేపట్టిన సంస్థ ప్రజలతో ఎలాంటి అవగాహన సమావేశం నిర్వహించలేదని, గ్రామసభ లేదా స్థానిక సంస్థ అనుమతి తీసుకోలేదని, పాఠశాలలు, దేవాలయం ఉన్న విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాల కోసమే కంపెనీ వ్యవహరిస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
నిర్మాణాన్ని అడ్డుకున్న ప్రజలు
సెల్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకోని నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇక్కడ టవర్ వద్దు పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.


