ఓట్ల లెక్కింపులో గందరగోళం
● పోలైన ఓట్లకు..లెక్కింపు ఓట్లకు వ్యత్యాసం
ములుగు రూరల్ : జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అధికారుల నిర్లక్ష్యంతో గందరగోళం నెలకొంది. ములుగు మండలంలోని కాశిందేవిపేట గ్రామంలో రెండో విడత ఎన్నికలు ఆదివారం నిర్వహించగా మొత్తం 1,914 ఓట్లు పోలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థితో పాటు 12 వార్డులకు గాను 2 వార్డులు ఏకగ్రీవం కాగా 10 వార్డులకు ఓటింగ్ నిర్వహించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థికి 527 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 489 ఓట్లు, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి 416 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 22 ఓట్లు, నోటాకు 63 ఓట్లు నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4, 8వ వార్డులు ఏకగ్రీవం కావడంతో కేవలం సర్పంచ్ అభ్యర్థికి మాత్రమే అక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు వార్డులో పోలైన ఓట్లు 397 ఉండడంతో అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాశిందేవిపేటలో పోలైన ఓట్లకు..లెక్కింపు చేసిన ఓట్లతో సరిపోలలేదు. ఎన్నికల అధికారులు కౌటింగ్ అనంతరం అభ్యర్థులు, కౌటింగ్ ఏజెంట్ల సమక్షంలో గెలిచిన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఓడిపోయిన అభ్యర్థుల నుంచి సంతకాలు సేకరించాలనే నిబంధనలున్నాయి. ఎన్నికల అధికారులు అవేవి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బీఆర్‌ఎస్ అభ్యర్థిని సర్పంచ్‌గా ప్రకటించారు. పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లలో వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టిఎస్ దివాకరకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోంటారో వేచి చూడాల్సిందే.


