రోగులకు నాణ్యమైన భోజనం అందించాలి
ములుగు: ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ సూచించారు. శనివారం వెంకటాపురం(ఎం) మండలం గుర్రంపేటకు చెందిన గర్భిణి ఝాన్సీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ తరఫున ఆస్పత్రి సిబ్బంది రోగులకు భోజనం వడ్డిస్తున్నారు. కూరలు నాణ్యతగా లేకపోవడంతో నిర్వాహకుడితో మాట్లాడి మరోసారి ఇలాంటి తప్పిదం జరిగితే విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. అనంతరం ఝాన్సీకి ఉమ్మ నీటి సమస్య ఉందని తెలుసుకుని డ్యూటీలో ఉన్న వైద్యురాలితో మాట్లాడారు. గతంలో బండారుపల్లికి చెందిన గర్భిణీ విషయంలో జరిగిన తప్పిదం కారణంగా ప్రభుత్వం, మంత్రి సీతక్క ఇబ్బందులు పడ్డారన్నారు. పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఓపీలో నిర్దిష్ట సమయం వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులను సూచించారు. ఆయన వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్, జక్కుల రేవంత్, పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు తదితరులు ఉన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్
ఏరియా ఆస్పత్రి పరిశీలన


