సౌకర్యాలు నిల్..!
మంగపేట: జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. హడావిడిగా కేంద్రాలను ప్రారంభించిన అధికారులు ఆయా కేంద్రాల వద్ద వసతుల కల్పనపై దృష్టి సారించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే సమయంలో అరగంట సేపు ఉండే అధికారుల కోసం టెంటు, కూల్ వాటర్ వంటి వసతులు కల్పించే నిర్వాహకులు ధాన్యం తేమశాతం వచ్చే వరకు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబెట్టే రైతులు, కూలీలకు నీడ, తాగునీటి వసతులు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు.
వసతుల కల్పనలో నిర్లక్ష్యం
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ద్వారా ఆదాయం పొందుతున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు సదుపాయాలు కల్పించడంలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ధాన్యం ఆరబోసిన తర్వాత నీడ వసతి లేకపోవడంతో ఎక్కడ నిలబడాలో అర్ధం కావడం లేదని రైతులు వాపోతున్నారు. తాగునీరు సైతం లేకపోవడంతో మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరుగు పేరిట 5నుంచి 10కేజీల కోత
సన్నరకం ధాన్యం పండించి రైతులకు ప్రభుత్వం చెల్లించే బోనస్ డబ్బులను కాజేసేందుకు దళారులు చూస్తున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్ డబ్బులు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కొందరు వ్యాపారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ్క రైతుల నుంచి ధాన్యాన్ని క్వింటాకు రూ.100 నుంచి 150వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ తరుగు పేరిట 5నుంచి 10కేజీల కోత విధిస్తున్నారు. అదే ధాన్యాన్ని బినామీల పేరుతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి బోనస్ డబ్బులను కాజేసే ప్రయత్నంలో ఉన్నారు. గత వర్షాకాలంలో ఇదే విధంగా దళారులు, కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల ఖాతాల్లో పడాల్సిన బోనస్ డబ్బులను వారి ఖాతాల్లో జమచేసుకున్నట్లు సమాచారం. సన్నరకం బియ్యం ధరలు పెరగుతుండడంతో ఇప్పటికే కొందరు దళారులు రైతుల నుంచి పచ్చి ధాన్యం క్వింటా రూ2వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.
అన్ని మండలాల్లో
కేంద్రాల ఏర్పాటు
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 145వరకు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మంగపేట, వెంకటాపురం(ఎం), వెంకటాపురం(కె), ఏటూరునాగారం, ములుగు మండలాల్లో కేంద్రాలను ప్రారంభించాం. తేమశాతం ఎక్కువగా ఉండటంతో కొనుగోళ్లు ఇంకా షురూ కాలేదు. కేంద్రాల్లోనే రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. అన్ని కేంద్రాలకు సరిపడా ప్లాస్టిక్ బరకాలు, గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో రైతులకు నీడ, తాగునీటి వసతి వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంటుంది.
ఫైజల్ హుస్సేన్,
జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు..
క్వింటా ధాన్యం ధర ఇలా..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కరువు
రైతులకు తప్పని తిప్పలు
పట్టించుకోని అధికారులు, నిర్వాహకులు
సౌకర్యాలు నిల్..!


