మధ్యతరహా ప్రాజెక్టుకు.. మరమ్మతులు ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

మధ్యతరహా ప్రాజెక్టుకు.. మరమ్మతులు ఎప్పుడో?

Jun 16 2023 6:28 AM | Updated on Jun 16 2023 1:05 PM

ప్రాజెక్టు తూము లీకేజీతో వృథాగా పోతున్న నీరు(ఫైల్‌) - Sakshi

ప్రాజెక్టు తూము లీకేజీతో వృథాగా పోతున్న నీరు(ఫైల్‌)

మంగపేట: మండల పరిధిలోని నర్సింహాసాగర్‌ వద్ద మల్లూరువాగుపై నిర్మించిన మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టు మరమ్మతు పనులు ఇంకెప్పుడు చేస్తారని ప్రాజెక్టు ఆయకట్టు రైతులు అధికారులను, పాలకులను ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్తున్నారే తప్పా శ్రద్ధ చూపడం లేదని మండిపడుతున్నారు. 26 అడుగుల నీటిమట్టం సామర్థ్యంతో 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రాజెక్టును ప్రారంభించారు. 1980లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా ఆయకట్టు భూములకు సాగునీటిని వదిలారు.

నర్సింహాసాగర్‌, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, వాగొడ్డుగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి వరకు 17 కిలోమీటర్ల కుడి కాల్వ ద్వారా సుమారు 4,300 ఎకరాలు, బాలన్నగూడెం, తిమ్మంపేట, మంగపేట, చెరుపల్లి తదితర గ్రామాల వరకు 8 కిలోమీటర్ల ఎడమ కాల్వ ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరు అందాల్సి ఉంది. 27 ఏళ్ల నుంచి ప్రాజెక్టు నిర్వహణపై సంబంధిత ఇరిగేషన్‌ అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేకపోవడం ప్రాజెక్టు అభివృద్ధిపై పాలకులు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో నిరాదరణకు గురైంది.

2007లో అప్పటి సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.16 కోట్ల జపాన్‌(జైకా) నిధులు మంజూరు అయ్యాయి. పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో అసంపూర్తిగా చేసి కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, అధికారులు కాజేశారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కుడి ఎడమ కాల్వల తూములకు ఏర్పడిన లీకేజీలకు మరమ్మతుల పేరుతో నాయకులు, అధికారులు కుమ్మకై ్క లక్షల రూపాయలు కాజేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

అభివృద్ధిని మరిచి సంబురాలు
తెలంగాణ స్వరాష్ట్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా అధికారులు, పాలకులు ప్రాజెక్టు అభివృద్ధిని మరిచి సంబురాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు. 2015లో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి చందూలాల్‌ ప్రాజెక్టును సందర్శించారు. వెంటనే ప్రాజెక్టు అభివృద్ధికి, కుడి, ఎడమ కాల్వలు, తూముల నిర్మాణం ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్‌ నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు.

హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడిచినా అతీగత లేదు. ఇప్పుడేమో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చెరువుల పండుగలో భాగంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టని ప్రాజెక్టులో నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు.

అధికారుల తీరు రైతులకు శాపం
ప్రాజెక్టుపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం పట్టిచుకోక పోవడం తమకు శాపంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. తూముల లీకేజీల పనులు వేసవి కాలంలో చేపట్టాల్సి ఉండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీరు చేరిన తరువాత కొందరు స్థానికులతో సంబంధిత అధికారులు కుమ్మక్కై నాసిరకంగా మరమ్మతులు చేపట్టడంతో యథావిథిగా లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పోతుందని రైతులు వాపోతున్నారు.

కాల్వల్లో షిల్టు పేరుకుపోయి సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చెరువు కట్టపై చెట్లను తొలిగించక పోవడంతో కట్టపై నుంచి నడిచి వెళ్లే వీలులేకుండా మారింది. చెరువు మత్తడి వద్ద గైడ్‌ వాల్స్‌ కోతకు గురై ధ్వంసమయ్యాయి. అపరాన్‌ రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మత్తడి నుంచి వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తే మత్తడికే ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement