‘నిర్భయ నిధి’కి జిల్లా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘నిర్భయ నిధి’కి జిల్లా ఎంపిక

Mar 15 2026 1:28 AM | Updated on Mar 15 2026 1:28 AM

కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన

మంత్రి సీతక్క

ములుగు: కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధి పథకం కింద ములుగు జిల్లాను ఎంపిక చేసింది. ఈ పథకంలో భాగంగా మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు (ఇంక్లూసివ్‌ సిటీస్‌ ఫర్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌) కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాను ఈ పథకానికి ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని శనివారం ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

పథకం లక్ష్యం

ఈ పథకం ద్వారా జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు జెండర్‌–రెస్పాన్సివ్‌ మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ములుగులో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారీకి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రికి వివరించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను సీతక్క అభినందించారు. తెలంగాణలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేస్తున్నందుకు తమ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపినట్లు వివరించారు.

క్రెచ్‌ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పాలనా’ ( మిషన్‌ శక్తి) పథకం కింద పనిచేస్తున్న క్రెచ్‌ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్‌ వర్కర్లకు నెలకు రూ. 5,500, హెల్పర్లకు రూ. 3వేలు గౌరవ వేతనంగా ఇస్తున్నారని.. ఇది వారు చేసే పనికి, బాధ్యతకు ఏమాత్రం సరిపోదని వివరించినట్లు తెలిపారు. ఈ పథకం విజయవంతం కావాలంటే సిబ్బందికి ఇచ్చే వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కోరినట్లు తెలిపారు. మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బంది ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని మంత్రి సీతక్క కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవిని కోరినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement