ఎవరికీ పట్టని ‘సీఎంఆర్‌’! | - | Sakshi
Sakshi News home page

ఎవరికీ పట్టని ‘సీఎంఆర్‌’!

Mar 15 2026 1:28 AM | Updated on Mar 15 2026 1:28 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైస్‌మిల్లును ఏడాది క్రితం డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. 2021–22, 2022–23 సంవత్సరాలకు సీఎంఆర్‌ కింద కేటాయించిన సుమారు రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం ఎగవేయడమే ఇందుకు కారణం. డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినా ఇప్పటికీ నూరు శాతం సీఎంఆర్‌ రికవరీ కాలేదు.

హసన్‌పర్తి మండలంలోని ఓ రైస్‌మిల్లు నిర్వాహకులు 2,200 మెట్రిక్‌ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది. దాడులు, తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడంతో 1,300 మెట్రిక్‌ టన్నులు చెల్లించారు. ఇంకా 900 మెట్రిక్‌ టన్నులు ఇవ్వాలని కమిషనర్‌ కార్యాలయానికి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

.. ఇలా ప్రతీసారి కస్టం మిల్లింగ్‌ ధాన్యం (సీఎంఆర్‌) దారి మళ్లుతోంది. వ్యాపారం, వృత్తి మీద నిబద్ధత ఉన్న సుమారు 75 శాతం మంది రైస్‌మిల్లర్లు సకాలంలో సీఎంఆర్‌ చెల్లిస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి, మరికొందరు అక్రమార్జన కోసం సీఎంఆర్‌ బకాయి పెడుతున్నారు. ఓ సీజన్‌కు చెల్లించాల్సింది మరో సీజన్‌కు ఇస్తూ.. కొందరు అధికారులను మేనేజ్‌ చేస్తూ సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. కొందరైతే మొత్తానికే ఎగవేస్తున్నారు. సర్కారు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి ‘రియల్‌’ వ్యాపారం చేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువ చేసే ధాన్యం దారి మళ్లుతుండగా అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు, రైస్‌మిల్లర్లకు సీఎంఆర్‌ వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది.

స్కాం ఇలా వెలుగులోకి..

ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని సివిల్‌ సప్లయీస్‌/మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైస్‌ మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత మిల్లింగ్‌ చేసి బియ్యం ఇవ్వాలి. ఒప్పందం ధాన్యం మిల్లింగ్‌ చేసి సుమారు 67 శాతం బియ్యం ఎఫ్‌సీఐ/సివిల్‌ సప్లయీస్‌ గోదాములకు ఇవ్వాలి. ఇక్కడే అసలు స్కాం మొదలవుతుంది. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్‌ చేయరు.. లేదా కొంత మాత్రమే మిల్లింగ్‌ చేస్తారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్‌ ధర ఎక్కువ ఉంటే ప్రైవేట్‌కు అమ్మేయడం, లేదంటే మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఫేక్‌ మిల్లింగ్‌ రికార్డులు, స్టాక్‌ రిజిస్టర్‌ మార్పులు చేసి తక్కువ బియ్యం చూపించడం.. బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ధాన్యం తడిగా ఉండడం, మిల్లింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ సమస్యలను చెప్పి దాటవేయడం పరిపాటి. తీరా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మిల్లుల్లో ఉన్న ధాన్యం, సరఫరా చేసిన బియ్యం లెక్కల్లో భారీ తేడా కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్‌ బకాయిలు, పక్కదారి పట్టించిన స్కాంలు బయట పడుతున్నాయి.

33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం

2021–22లో రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కింద రైస్‌మిల్లర్లకు సరఫరా చేశారు. ఆ ధాన్యానికి సంబంధించిన బియ్యం సరఫరా చేయడంలో ఉమ్మడి వరంగల్‌లోని 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం వహించారు. బియ్యం చెల్లించని వారికి పౌరసరఫరాలశాఖ నోటీసులు ఇచ్చింది. స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2023లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్‌లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు.. తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్‌ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇంకా సుమారు రూ.107 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌర సరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు కొందరు రైస్‌మిల్లర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంఆర్‌ బకాయిలు రాబట్టడంపై కొందరిపై కఠినంగా, మరికొందరిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌లో సీఎంఆర్‌ బకాయిలపై కమిషనర్‌ కార్యాలయం తాజాగా ఆరా తీయడం రైస్‌మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది.

డిఫాల్టర్‌ రైస్‌మిలర్లపై చర్యలు లేవు.. వారి వద్దే కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌

నోటీసులకే పరిమితమైన రికవరీ.. ‘తిలా పాపం తలా పిడికెడు’లా పరిస్థితి

మూడేళ్లు గడిచినా ఇంకా మౌనమే.. మిల్లర్ల వ్యాపారానికి సర్కారు ధాన్యం

అధికారుల ఉదాసీనతపై కమిషనర్‌ సీరియస్‌.. మళ్లీ తెరపైకి బకాయిల వ్యవహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement