● ప్రజలు ఆందోళన చెందొద్దు
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాలో గ్యాస్ సరఫరా, పోలీస్, సివిల్ సప్లయీస్, రవాణా, వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులను అడిగితెలుసుకుని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి జిల్లాలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల్లో గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ హాస్టల్, పాఠశాల, గురుకులాలను సందర్శించి పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో అవసరమయ్యే గ్యాస్‌కు సంబంధించి వైద్యాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ఆస్పత్రుల్లో గ్యాస్ సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎవరైనా గ్యాస్ సిలిండర్లకు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే సహించేదిలేదన్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బ్లాక్‌లో విక్రయించకుండా పోలీస్ అధికారులు నిరంతరం నిఘా పెట్టాలన్నారు.
మానిటరింగ్ కమిటీ ఏర్పాటు..
రాష్ట్ర పౌరసరఫరాలు, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గ్యాస్ సరఫరా సిలిండర్ల సరఫరాను పర్యవేక్షించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా సివిల్ సప్లయీస్ ఆఫీసర్ కన్వీనర్‌గా 12 మంది అధికారులతో కలిసి జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ గ్యాస్ సరఫరా ఇబ్బందులపై పర్యవేక్షణ జరుపుతుందని వెల్లడించారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌లను కమర్షియల్‌గా వాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. పౌరసరఫరాల అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 18004257109 లో సంప్రదించవచ్చని కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, జిల్లా సివిల్ సప్లయీస్ ఆఫీసర్ ఫైజల్ హుస్సేని, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, డీఏఓ సురేశ్‌కుమార్, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.


