యాప్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

యాప్‌ కష్టాలు

Mar 15 2026 1:28 AM | Updated on Mar 15 2026 1:28 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026

గోవిందరావుపేట: జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె) వంటి మండలాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. ఆయా మండలాల్లో 1/70చట్టం అమలులో ఉండడంతో చాలా మంది రైతులకు పట్టాలు లేవు. ఇటీవల ప్రభుత్వం యూరియా పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు, బుకింగ్‌ చేసుకునేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూరియా బుకింగ్‌కు నిరక్షరాస్యులు, కౌలు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

1.25లక్షల ఎకరాల్లో పంటలు సాగు

జిల్లాలోని పది మండలాల్లో సుమారుగా 98 వేల మంది రైతులు ఉన్నారు. వీరు 1.25లక్షల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఈ మేరకు యాసంగికి గాను 17వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. అలాగే సుమారుగా 25 వేల నుంచి 30వేల వరకు కౌలుదారులు వ్యవసాయం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే నిరక్షరాస్యులు, భూమి పట్టాలు లేని రైతులు 30వేల మంది వరకు ఉన్నారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేయడం చాలా మంది రైతులకు కష్టంగా మారింది.

పట్టా లేని రైతులు, కౌలు రైతులకు..

ఏజెన్సీలో అనేక ఏళ్లుగా భూములు సాగుకుంటున్నా పట్టాలు రాలేదు. యూరియా కావాల్సిన రైతులు స్మార్ట్‌ ఫోన్‌లో ప్రభుత్వం సూచించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని భూమి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భూమి పట్టా లేని రైతులతో పాటు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం యాప్‌లో యూరియాను బుకింగ్‌ చేసుకోవడం ద్వారా ఎక్కడ ఎరువులు ఎంత అవసరమో ముందుగానే స్పష్టమైన సమాచారం ఉంటుందని చెబుతున్నారు. ఆ వివరాల మేరకు ఎరువుల సరఫరా సులభమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల రైతుల పరిస్థితిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని, గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ ద్వారా ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సహాయం చేయాలని కోరుతున్నారు.

యూరియా బుకింగ్‌కు ఇబ్బందులు పడుతున్న రైతులు

ఏజెన్సీలో చాలా భూములకు పట్టాలు లేని పరిస్థితి

నిరక్షరాస్యులు, కౌలు రైతులకు తప్పనితిప్పలు

ఎన్‌డీఎస్‌ ఆప్షన్‌తో బుక్‌ చేసుకోవచ్చు

అగ్రికల్చర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో మొబైల్‌ నంబర్‌ నమోదు చేస్తే రైతుకు సంబంధించిన పట్టా పాస్‌ బుక్‌, భూమి వివరాలు ఆటోమెటిక్‌గా కనిపిస్తాయి. రైతు ఏ పంట వేశాడో ఎంపిక చేసుకుంటే దానికి అనుగుణంగా ఎకరాలు, యూరియా అవసరం చూపిస్తుంది. కౌలు దారులు అయితే అసలు పట్టాదారి మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి. ఆ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్‌ చేస్తే యూరియా బుకింగ్‌ అవుతుంది. పట్టా లేని రైతుల కోసం ఎన్‌డీఎస్‌(నాన్‌ డిజిటల్‌ సైన్డ్‌ ) అనే ఆప్షన్‌ ఉంది. వీరు ఏఈఓను సంప్రదిస్తే మొబైల్‌ నంబర్‌ ఆధారంగా లాగిన్‌ చేసి సుమారు 15 నిమిషాల్లో బుకింగ్‌ పూర్తి చేస్తారు.

– వి. సురేశ్‌, డీఏఓ

బుకింగ్‌ చేయడం కష్టంగా ఉంది

యాసంగిలో రెండు ఎకరాల్లో వరి వేశాను. నేను చిన్న ఫోన్‌ వాడుతాను. ప్రభుత్వం యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకోవాలని చెప్పుతోంది. కానీ నా లాంటి రైతులకు అది చాలా కష్టంగా మారింది. స్మార్ట్‌ ఫోన్‌ ఎలా వాడాలో తెలియదు. నాలాంటి చిన్న రైతులకు గ్రామంలోనే ఎరువులు సులభంగా దొరికేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

– గోపగాని ఐలయ్య, కౌలు రైతు, చల్వాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement