● తొలిరోజు నలుగురు గైర్హాజరు
ములుగు: పదోతరగతి పరీక్షలు తొలిరోజు షురూ అయ్యాయి. ఈ మేరకు తొలిరోజు శనివారం తెలుగు పేపర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 3,290 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా నలుగురు గైర్హాజర్ అయ్యారని తెలిపారు. జిల్లాలోని 15 పరీక్ష కేంద్రాలను శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించాయని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలుగు పరీక్ష ప్రశాంతంగా సాగిందని వివరించారు. పరీక్షకు పరీక్షకు మధ్య ఉన్న వ్యవధిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తదుపరి పరీక్షకు సిద్ధం అయ్యేందుకు సంబంధిత సబ్జెక్టు టీచర్ పర్యవేక్షణలో సలహాలు తీసుకోవాలని డీఈఓ సూచించారు.


