
ప్రస్తుతం ఆడియన్స్ రెగ్యులర్ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఆధారిత సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యముడు’. ఈ సినిమాకి ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉప శీర్షిక ఉంది. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.
తాజాగా ‘యముడు’ టీజర్‌ను గురువారం ప్రముఖ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్‌ను చూసిన తర్వాత ఆయన చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ టీజర్ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌ల మిశ్రమంగా ఉంది. సిటీలో అమ్మాయిలు అదృశ్యమవుతున్న కేసులు, నాటకాల్లో యముడి వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలతో సంబంధం ఉందేమో అనే సూచన టీజర్‌లో కనిపిస్తుంది. యముడు భూలోకానికి వచ్చి నరకంలో విధించే శిక్షలను ఇక్కడే అమలు చేస్తున్నాడా అనే ఆలోచన కలిగిస్తుంది.
‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దృక్పథంతో సినిమాను తీర్చిదిద్దినట్లు సూచిస్తోంది. హిందూ ధర్మం నుంచి ఒక నూతన కోణాన్ని ఆసక్తికరంగా అందించేలా ఈ చిత్రం ఉంటుందని టీజర్ చూస్తే అనిపిస్తుంది. విష్ణు రెడ్డి వంగా సినిమాటోగ్రఫీ, భవాని రాకేష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరింత ఆకట్టుకునేలా చేశాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.