దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు మొన్నటివరకు బయటపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ అనేసరికి అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. ప్రస్తుతం వేలాదిమంది సమక్షంలో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మూవీ గురించి, మహేశ్ యాక్టింగ్ గురించి కూడా అద్భుతమైన అప్‌డేట్ వచ్చేసింది.
'వారణాసి' కథని రాసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా తాలూకు 30 నిమషాల యాక్షన్ ఎపిసోడ్ చూశాను. అందులో సీజీ లేదు, బీజీఎం లేదు, అయినా కానీ మహేశ్ బాబుని అలా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను మంత్రంతో కట్టి పడేసింది. మీరు కూడా అనుభూతి పొందుతారు. మహేశ్ తాలూకు విశ్వరూపం చూసి షాక్ అవుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కానీ కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నారు. ఏం చేయాలో చెబుతూ ఉన్నారు' అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.
30 నిమిషాల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ అంటే కచ్చితంగా ఇది క్లైమాక్స్ అయి ఉండొచ్చు. విజయేంద్రప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే కొంతమేర తీశారు. కాకపోతే దీనికి సీజీ, గ్రాఫిక్స్, బీజీఎం లాంటివి జోడిస్తే ఏ రేంజులో ఉంటుందోనని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.


