‘‘రణబాలి’ సినిమా ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ హై ఇస్తుంది. ఎంగేజింగ్‌గా ఉంటుంది. మన చరిత్ర గురించి వచ్చిన ‘రణబాలి’ సినిమాకుమంచి ప్రేక్షకాదరణ లభిస్తే, ఈ తరహా సినిమాలు మరిన్ని వస్తాయి. అందుకే మేం ఈ సినిమాను చాలా బాధ్యతగా, జాగ్రత్తగా చేశాం. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ దేవరకొండ చెప్పిన సంగతులు...
⇒ ‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత నేను కంఫర్ట్‌గా ప్రమోషన్ చేస్తూ, సినిమా కాపీని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ, ప్రశాంతంగా రిలీజ్‌కు సిద్ధం చేసుకుంటున్న సినిమా ‘రణబాలి’. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ సమయంలోనే సీజీ వర్క్‌కు కొంత ప్రాధాన్యత ఉందని మాకు తెలిసింది. అందుకే ఫిబ్రవరి సమయంలోనే సీజీ వర్క్ మేం అనుకున్న సమయంలోనే పూర్తయ్యేలా ప్లాన్ చేశాం. ఇక సోమవారం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతాయి. మా సినిమాకు ఏ తరహా సర్టిఫికెట్ వచ్చినా ఓకే. ఒక్కో సినిమాను ఒక్కో పర్పస్ కోసం చేస్తాం. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలనే ఈ ‘రణబాలి’ సినిమా తీశాం.
⇒ అనంతపురంలో జరిగే ఓ జాతరలో కొంతమంది వీరుల గురించి విన్న బుర్రకథల ఆధారంగా దర్శకుడు రాహుల్ ఈ సినిమాను రెడీ చేశారు. ‘రణబాలి’ సినిమా ఓ బుర్రకథతోనే ప్రారంభం అవుతుంది. మన దేశ భవిష్యత్ గురించి మనం ఆలోచించాలంటే చరిత్ర తెలియడం ముఖ్యం. మన చరిత్రలో రహస్యంగా మనకు తెలియకుండా మిగిలిపోయిన అధ్యాయాలను సినిమా మాధ్యమం ద్వారా వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతాయి. లేదంటే ఇంకెవరూ ఇలాంటి కథల్ని ముట్టుకోరు. ఈ కోవకి చెందిన ‘రణబాలి’ విజయం సాధిస్తే ఈ తరహా సినిమాలు మరిన్ని వస్తాయి.
⇒ 1876 నుంచి 1878 మధ్య కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చిన కరువు వల్ల 80 లక్షల మంది ప్రజలు చనిపోయారని ఓ జర్నలిస్ట్ అన్నారు. చాట్ జీపీటీ తయారు చేసిన కంటెంట్ మనకు నిజాలు చెప్పదు. టెక్నాలజీ కోణంలోనే చరిత్రను తెలియజేస్తుంది. ట్రావెన్‌కోర్ ప్రాంతంలోనే 65 లక్షల మంది కరువుతో చనిపోయారు. ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఇంత దారుణమైన కరువు వస్తే, ఇంకా చరిత్రలో మనకు తెలియని బీహార్, బెంగాల్... ఇలా ఎన్నో కరువు ఘటనలు ఉన్నాయి. వర్షపాతం కారణంగా వచ్చే కరువు వేరు. అప్పుడు స్థానికంగా ఉండే పాలకులు, పెద్దలు రైతులకు, ప్రజలకు పన్నుల భారం తగ్గించేవారు.
కానీ బ్రిటిషర్స్ వచ్చాక కరువు ప్రాంతాల్లో రెట్టింపు పన్నులు వసూలు చేయడం ప్రారంభించారు. ఆ ట్యాక్స్ కట్టకుంటే భారీ ప్రాజెక్ట్స్, రైల్వే లైన్స్ నిర్మించే దగ్గరకు వారిని తరలించి కఠోరమైన పని చేయించేవారు. దానికి నామమాత్రంగా ధాన్యం ప్రతిఫలంగా ఇచ్చేవారు. పని చేయని వారికి ఆకలితో చావే గతి. చరిత్రలో జరిగిన ఈ దారుణాలు తెలుసుకుంటే మనసు వికలమైపోతుంది. కొన్ని అమెరికన్ పత్రికల ద్వారా భారతదేశ పరిస్థితి తెలుసుకున్న అమెరికన్లు బ్రిటిషర్లు ఎలాంటి దారుణ పరిస్థితులు సృష్టించారో తెలుసుకుని తమ దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం ప్రారంభించారట. మన ప్రజల దైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందని ఆ పాత్రికేయుడు నాతో చె΄్పారు.
⇒ మన చరిత్రలో ప్రజల కోసం నిలబడిన ఎంతోమంది గొప్ప వీరులు ఉన్నారు. ఈ వీరులంతా మూడు పదుల్లోనే చనిపోయారు. అలాంటివారే మా ‘రణబాలి’ సినిమాకు స్ఫూర్తి. చరిత్రలో మరుగున పడిన ఈ వీరుల కథలను మన జానపదాల్లో పాడటం వల్ల ప్రజలకు తెలిసింది. ఆ తర్వాత మన దేశ రచయితలు కొందరు వాటిని పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు. ఆ వీరుల గొప్పదనం, మన పూర్వీకులు ఎదుర్కొన్న దారుణాలు, మన సొసైటీలో అప్పుడు కొందరు చేసిన తప్పేంటి, బ్రిటిషర్స్ ఈ విశాల దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు? ఇలా అన్నింటినీ మేము ‘రణబాలి’ సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించబోతున్నాం. ‘రణబాలి’ సినిమా విజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. జెన్యూన్‌గా ట్రైలర్ కట్ చేశాం. మా మూవీకి వెళ్లి థియేటర్‌లో కూర్చుంటే ఐదు నిమిషాల్లో ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు.
⇒ ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు బ్రిటిషర్లు చేసిన దారుణాల కంటే మా సినిమాలో చూపించినవి తక్కువే. ఇది సాఫ్ట్‌గా చెప్పే కథ కాదు, సాఫ్ట్‌గా చూపించే ప్రపంచం కాదు. మా సినిమాలో కేవలం యాక్షన్ కోసమే యాక్షన్ సీన్సులు చేయలేదు. ఈ సినిమా యాస, గుర్రపు స్వారీ నేర్చుకోవడం నాకు సవాల్‌గా అనిపించింది. నేను పుట్టపర్తిలో చదువుకున్నాను కాబట్టి నాకు రాయలసీమ యాస కొంత పరిచయమే. ఈ సినిమా కోసం పర్ఫెక్ట్‌గా ఉండేలా నేర్చుకున్నాను. తెలంగాణ యాసకు రాయలసీమ యాస దగ్గరగా ఉంటుంది. 2 నుంచి 3 నెలల పాటు యాస, డైలాగ్స్ మీద సాధన చేశాను. నేను ఏ సినిమా చేసినా ఆ పాత్ర ప్రభావం కొన్నాళ్లు నా మీద ఉంటుంది. అలా ‘రణబాలి’ ప్రభావం చాలా ఉంది.
⇒ నేను హీరోగా చేసే సినిమాల్లో హీరోయిన్‌గా రష్మిక పేరును దర్శకులు సూచిస్తుంటుంటారు. అయితే నాకు ‘రణబాలి’లోని జయమ్మ పాత్రకు రష్మిక అయితే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో రణబాలి, జయమ్మ (రష్మిక పాత్ర పేరు) పాత్రల మధ్య మంచి ఎమోషనల్ డ్రామా ఉంది. మేము కలిసి చేయడం వల్ల ఈ పాత్రలకు ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ వచ్చింది. ఆ పాత్రలపై మా రియల్ లైఫ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇదే ఫీల్ అవుతారు. ఆర్నాల్డ్ వోస్లూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా చరిత్ర గురించి చర్చించుకుంటారు.
⇒ బయోపిక్ చేయాలనే ఆకాంక్ష నాకు ఉంది. అయితే సత్య సాయిబాబా బయోపిక్‌కు నేను న్యాయం చేయలేనని నాకు తెలుసు. అందుకు కారణం ఆయనలో ఉన్న స్వచ్ఛత, సున్నితత్వం నాలో లేవన్నది నా ఫీలింగ్. నేను చేయగలిగే బయోపిక్‌లు వస్తే తప్పక చేస్తాను.
రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఈ అంశంపై సినిమాలు వచ్చాయి. అక్కడ పాలెగాళ్ళు ఉన్నారు. వీరిపై సినిమాలు తీస్తున్నారు. ΄్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్ సినిమాలైనా, పాలెగాళ్ల సినిమాలైనా అక్కడి ప్రజల మీద తీసినవే. వాళ్లు నటించలేరు. నిజాయితీగా ఉన్నామనే బలంతో వారికి ఎక్కువ కోపం వస్తుంది. సీమలో ఉన్న ఎండ, అక్కడ భూమి మనుషులను గట్టిగా చేస్తుంది. దర్శకుడు రవికిరణ్ నాతో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ‘రౌడీ జనార్ధన’ సినిమా చేస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో రాహుల్ ‘రణబాలి’ సినిమా చేశాడు. ఇక తెలంగాణను ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్‌కు చూపించారు. ఒక స్లాంగ్‌ను ఎక్కువగా కామెడీగా చూపించారు. రాయలసీమ స్లాంగ్‌ను విలన్, ఫ్యాక్షన్ కు చూపించారు. అయితే రవికిరణ్ కోలా, రాహుల్.... ఈ ఇద్దరూ కూడా ఆ ప్రాంతం యాసల్లోని హీరోయిజం కనిపించేలా సినిమా చేయాలని అనుకుంటున్నామని చె΄్పారు. ఆ తరహాలో ఉన్న ఈ రెండు సినిమాలూ అలరిస్తాయని అనుకుంటున్నాను.
సినిమా టికెట్ ధరల పెంపు అనేది నాకు ఎప్పట్నుంచో ఇష్టం లేదు. కానీ ఇది నిర్మాతలకు సంబంధించిన విషయం. అయితే నా సినిమాల నిర్మాతలతో నా సినిమాల టికెట్ ధరలు పెంచవద్దని చెబుతుంటాను. నేను ఇంటర్ చదువుకునే సమయంలో రోజూ టిఫిన్ చేసేందుకు మా నాన్నగారు నాకు పది రూపాయలు ఇచ్చేవారు. ఐమ్యాక్స్ థియేటర్స్‌లో సినిమా చూడాలంటే టికెట్ ధర రూ. 80 ఉండేది. థియేటర్‌కు మా స్నేహితుడి బైక్ మీద వెళితే, ప్రయాణపు ఖర్చులు ఉండవు. కూల్‌డ్రింక్, పాప్‌కార్న్ స్కిప్ చేసేవాడిని. సడన్‌గా ఆ థియేటర్ యాజమాన్యం టికెట్ ధర ను రూ. 100 చేశారు. నాకు బాధ కలిగింది. నేను చూడాలనుకున్న సినిమాలను వెంటనే థియేటర్స్‌లో చూడలేకపోయాను. ఆ ఫీలింగ్ నాకు గుర్తుంది.
ఆ రోజు టికెట్ ధరలు పెంచడం నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. అయితే టికెట్ ధరల పెంపు వెనకాల ఉన్న బిజినెస్ గురించి అప్పుడు నాకు తెలిసే వయసు కాదు. కానీ ప్రోడ్యూసర్‌కు కంట్రోల్ ఉన్నంతవరకు నేను హీరోగా చేసే ఏ సినిమాకు టికెట్ రేట్స్ హైక్ వద్దు. ‘బిజినెస్ పరంగా ఏదైనా ఉంటే, అది మనం వర్కౌట్ చేసుకుందాం. నేను తక్కువ చేయడం (రెమ్యునరేషన్‌ని ఉద్దేశించి కావొచ్చు), లాభాల్లో వాటా గురించి మాట్లాడుకోవడం వంటివి మనం చూసుకుందాం’ అని నిర్మాతలతో చెబుతుంటాను. విజయ్ దేవరకొండ సినిమాకు టికెట్ రేట్స్ హైక్ అనేది ఉండదు.
ఒకవేళ నేను రాజమౌళిగారితో సినిమా చేస్తే అప్పుడు తెలియదు. ఇది ఇప్పుడే నేను ఎందుకు చెప్తున్నానంటే... అరె...‘రణబాలి’ సినిమా సమయంలో విజయ్ అలా చె΄్పాడు. మళ్లీ ఇప్పుడు ఇలా ఏంటి? అనే చర్చ జరగకూడదు. నేను సినిమా ఒప్పుకునేప్పుడే ఈ విషయం గురించి నిర్మాతలతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇక ‘రణబాలి’ సినిమాకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఆ డబ్బులు ఎక్కువగా ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, ప్రేక్షకుల నుంచి వస్తే మంచిదని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా పర్పస్ అందరికీ తెలియాలి.


