25 వసంతాలు పూర్తి చేసుకున్న 'రాజా'.. ఈ సినిమాను వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

25 వసంతాలు పూర్తి చేసుకున్న 'రాజా'.. ఈ సినిమాను వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌

Published Tue, Mar 19 2024 1:06 PM

Venkatesh And Soundarya Raja Movie Enter In Silver Jubilee - Sakshi

రాజా.. 1999 మార్చి 18న ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే సినిమాకు రీమేక్‌.. ఇప్పటికి టాలీవుడ్‌లో ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు పూర్తి కావడం జరిగింది. 

ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ క్రమంలోనే రాజా చిత్రం తెలుగులో రీమేక్‌ అయి భారీ విజయాన్ని అందుకుంది. 1999లో విడుదలయిన ఈ సినిమా వెంకటేశ్‌- సౌందర్య జోడీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. వాస్తవంగా 'రాజా'లో హీరోయిన్ మొదట సౌందర్య కాదట. ఈ సినిమాకు మొదటగా రోజాను హీరోయిన్‌గా అనుకున్నారట. అందుకు కారణం రాజా మాతృక అయిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే చిత్రంలో మొదట నటించింది రోజానే కావడం. తమిళంలో వచ్చిన ఆ సినిమాతో ఆమెకు ఎనలేని క్రేజ్‌ వచ్చింది.

తమిళంలో లీడ్ రోల్స్‌లో కార్తిక్, రోజా, అజిత్ నటించారు. తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా చాలానే అందాయి. ఈ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్‌లో కూడా నటించాలని నిర్ణయించుకుంది. దానికి తనకు అవకాశం లభించింది కూడా. కానీ ఆ సమయంలో రోజా వద్ద అవసరమైన డేట్స్‌ లేకపోవడంతో సౌందర్యను సంప్రదించి రాజా సినిమాను పట్టాలెక్కించారు. ఇందులో వెంకీ, సౌందర్య కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరిని ఆన్ స్క్రీన్ క్యూట్ కపుల్‌గా అనేవారు. అంతలా ప్రేక్షకులకు సినిమా కనెక్ట్‌ అయింది.

ఆ రోజుల్లో రాజా సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. విడుదలైన అన్ని చోట్లు 50రోజులు ఆడిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో మొదట దొంగగా కనిపించిన వెంకీ ఆ తర్వాత తన సరైన నటనతో ప్రేక్షకులను కదిలించాడు. అంతే స్థాయిలో సౌందర్య తన సెంటిమెంట్‌తో కట్టిపడేసింది. 71 కేంద్రాల్లో రాజా సినిమా 100 రోజులు ఆడింది. 4 సెంటర్‌లలో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా వెంకటేశ్‌ కెరియరల్‌లో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఈ సినిమా ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్‌, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది.  ఈ సినిమాకు ఉత్తమ  ఉత్తమ నటిగా సౌందర్యకు నంది అవార్డు దక్కింది.  రాజా విడుదలయ్యి నేటితో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది.

Advertisement
Advertisement