
దేశభక్తి నేపథ్యంలో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.
ప్రభాస్ ఫౌజి
వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు సూపర్‌గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
డ్రాగన్‌లో దేశభక్తి
హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్‌పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.
బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్
‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్‌గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్‌పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్‌పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్‌లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్‌ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్‌కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం.
భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.
మేజర్ షైతాన్ సింగ్
భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్‌లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.
ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్‌గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్‌లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.
సైనికుడి వాగ్దానం
సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.
భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్‌తోపాటు కశ్మీర్‌లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.
ఆపరేషన్ ఖుక్రీ
పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్‌లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్‌లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్‌లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్‌ను రాజ్ పాల్ పునియా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.
‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్‌దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్‌దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
స్వాతంత్య్రానికి పూర్వం...
భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్‌లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్‌లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆపరేషన్ సిందూర్
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు
⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు.
ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.