వెండితెరపై సినీ జీవితం | Upcoming Biography Movies Updateds in Bollywood | Sakshi
Sakshi News home page

వెండితెరపై సినీ జీవితం

Oct 17 2025 4:09 AM | Updated on Oct 17 2025 4:09 AM

Upcoming Biography Movies Updateds in Bollywood

బాలీవుడ్‌లో జోరుగా సినిమా తారల బయోపిక్స్‌

సైన్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్‌... ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్స్‌లో సినీ తారలు నటించడం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలో ఇప్పటివరకు చాలా బయోపిక్స్‌ వచ్చాయి. మరికొన్ని బయోపిక్స్‌ రానున్నాయి. అయితే వీటిలో సినీ తారల బయోపిక్స్‌ చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ సడన్‌గా ఇప్పుడు బాలీవుడ్‌లో సినీ తారల జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్స్‌ సంఖ్య ఎక్కవైంది. మరి... ఏ స్టార్స్‌ బయోపిక్స్‌ వెండితెరపైకి రానున్నాయి? ఈ తారల బయోపిక్స్‌లో ఎవరు నటించనున్నారు? అన్న వివరాలపై ఓ లుక్‌ వేయండి.

ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా 
దాదా సాహెబ్‌ ఫాల్కేను ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా చెప్పుకుంటాం. పూర్తి నిడివితో తొలి భారతీయ సినిమా తీసిన వ్యక్తిగా దాదా సాహెబ్‌ ఫాల్కే ఘనత గొప్పది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా దాదా సాహెబ్‌ ఫాల్కే పేరిట అవార్డును ప్రదానం చేస్తుంది. ఇలాంటి ప్రముఖ వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు... ఇండస్ట్రీ వర్గాల్లోనూ క్రేజ్‌ ఉంటుంది. దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆమిర్‌ ఖాన్‌ నటించనున్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కేగా ఆయన కనిపిస్తారు.

ఆమిర్‌ ఖాన్‌తో గతంలో ‘పీకే, 3 ఇడియట్స్‌’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఫిల్మ్స్‌ తీసిన రాజ్‌కుమార్‌ హిరాణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో నటించనున్నట్లుగా ఆమిర్‌ ఖాన్‌ కూడా వెల్లడించారు. రాజ్‌కుమార్‌ హిరాణి, అజిభిత్‌ జోషి, హిందుకుష్‌ భరద్వాజ్, ఆవిష్కర్‌ భరద్వాజ్‌ ఈ సినిమా స్క్రిప్ట్‌పై నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ బయోపిక్‌కు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్‌ పనులు ఇటీవలి కాలంలో మరింత ఊపందుకున్నాయట. వచ్చే ఏడాది రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుందని సమాచారం. 

ఈ సినిమాకు దాదా సాహెబ్‌ మనవడు చంద్రశేఖర్‌ శ్రీకృష్ణ స పోర్ట్‌ చేస్తున్నారు. మేడ్‌ ఇన్‌ ఇండియా: ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి 2023 సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రం ‘నోట్‌ బుక్‌’ ఫేమ్‌ నితిన్‌ కక్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లుగా, కార్తికేయ, వరుణ్‌ గుప్తా నిర్మించనున్నట్లుగా ఈ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనౌన్స్‌మెంట్‌లో ఉంది.

అయితే దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని, అందుకే రాజమౌళి ఈ సినిమాలో భాగమయ్యారని, ఇందులో దాదా సాహెబ్‌ ఫాల్కేగా ఎన్టీఆర్‌ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాను 2023 సెప్టెంబరులో ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. సో... ఈ చిత్రంపై స్పష్టత రావాల్సి ఉంది.

మ్యూజిక్‌ మేస్ట్రో 
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బయోపిక్‌ వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో ఇళయరాజాగా ధనుష్‌ నటిస్తారు. గత ఏడాది మార్చిలో ఇళయరాజా బయోపిక్‌ను అధికారికంగా ప్రకటించారు. ధనుష్‌తో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమా తీసిన అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈపాటికే పూర్తి స్థాయిలో ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందట.

ప్రస్తుతం ధనుష్‌ రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ను హీరోగా పరిచయం చేసే సినిమా పనుల్లో అరుణ్‌ బిజీగా ఉన్నారు. ఇలా ధనుష్, అరుణ్‌ల ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ పూర్తయిన తర్వాత ‘ఇళయరాజా’ బయోపిక్‌ సెట్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌ సమాచారం. అంతేకాదు... ఇళయరాజా బయోపిక్‌లో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు గెస్ట్‌ రోల్స్‌లో నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కనెక్ట్‌ మీడియా, పీకే ప్రైమ్‌ ప్రోడక్షన్, మెర్క్యూరీ మూవీస్‌ సంస్థలు ఈ బయోపిక్‌ను నిర్మించనున్నట్లు అనౌన్స్‌మెంట్‌  పోస్టర్‌పై ఉంది.

ఆమిర్‌ లేదా రణ్‌బీర్‌ 
ప్రఖ్యాత గాయకులు కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌ వెండితెర పైకి రానుంది. ఈ బయోపిక్‌పై దర్శకుడు అనురాగ్‌ బసు ఎప్పట్నుంచో వర్క్‌ చేస్తున్నారు. ఈ బయోపిక్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేక పోయారు. ‘‘కిశోర్‌ కుమార్‌గారి బయోపిక్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ను అనుకున్న మాట వాస్తవమే. కాక పోతే ఈ బయోపిక్‌కు బదులు ‘రామాయణ’ సినిమాను రణ్‌బీర్‌ కపూర్‌ ఎంపిక చేసుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో అతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు అనురాగ్‌ బసు.

కాగా కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌లో ఆమిర్‌ ఖాన్‌ నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరపైకి వచ్చాయి. ఇటీవల ఓ సందర్భంలో కిశోర్‌ కుమార్‌గారి బయోపిక్‌లో నటించే చాన్స్‌ వస్తే తప్పుకుండా చేస్తానన్నట్లుగా ఆమిర్‌ ఖాన్‌ కూడా చె΄్పారు. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్‌లో ఆమిర్‌ ఖాన్‌ నటించే అవకాశం ఉందని ఊహించవచ్చు. కానీ కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌కు అనురాగ్‌ బసు తొలుత రణ్‌బీర్‌ కపూర్‌ను అనుకున్నారు. అప్పట్లో కుదర్లేదు. అయితే  ఇప్పుడు ‘రామాయణ’ సినిమా పూర్తి కావొచ్చింది. రణ్‌బీర్‌ కపూర్‌ చేస్తున్న మరో సినిమా ‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంటోంది.

ఈ నేపథ్యంలో కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ నటించే అవకాశం లేక పోలేదు. పైగా దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌తో ఆమిర్‌ ఖాన్‌ బిజీ కానున్నారు. ఒకేసారి రెండు బయోపిక్స్‌లో ఆమిర్‌ ఖాన్‌ నటించడం సాధ్యం కాక పోవచ్చు కనుక కిశోర్‌ కుమార్‌గా వెండితెరపై రణ్‌బీర్‌ కపూర్‌ కనిపించే అవకాశం లేక పోలేదు.

ఫైనల్‌గా కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌లో ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. మరోవైపు కిశోర్‌కుమార్‌ బయోపిక్‌ చేయాలని బాలీవుడ్‌ దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ ఓ కథ రెడీ చేశారు. ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌ను హీరోగా అనుకున్నారు. కానీ అనురాగ్‌ బసు చేస్తున్న ప్రాజెక్ట్‌ గురించి తెలుసుకున్న సూజిత్‌ సర్కార్‌ తన ప్రయత్నాలను ఆపేశారు. ఈ విషయాలను సుజిత్‌ సర్కార్‌ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు.

గురుదత్‌ బయోపిక్‌లో విక్కీ? 
‘సైలాబ్, కాగజ్‌ కె పూల్,  ఫ్యాసా’ వంటి ఎన్నో క్లాసిక్‌ హిట్‌ ఫిల్మ్స్‌ తీసిన లెజెండరీ దర్శకుడు గురుదత్‌ జీవితం వెండితెర పైకి రానుందని బాలీవుడ్‌ సమాచారం. అల్ట్రా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఇందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బయోపిక్‌కు భావనా తల్వార్‌ దర్శకత్వం వహిస్తారని, ‘ ఫ్యాసా’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం బాలీవుడ్‌లో జరుగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలో గురుదత్‌గా విక్కీ కౌశల్‌ నటిస్తారని, ఇందుకోసం మేకర్స్‌ ఆల్రెడీ ఈ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారని బాలీవుడ్‌ భోగట్టా. మరి... వెండితెరపై గురుదత్‌గా విక్కీ కౌశల్‌ నటిస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

మధుబాల బయోపిక్‌ 
‘ ఫ్యార్‌ కియాతో డర్నా క్యా...’ అంటూ వెండితెరపై అనార్కలిగా మధుబాల నటన అద్భుతం. 1960లో విడుదలైన ‘మొఘల్‌ ఏ అజం’ సినిమా మధుబాలకు అప్పట్లో దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాయే కాదు... పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు మధుబాల. దాదాపు 60 సినిమాల్లో నటించిన మధుబాల 36 సంవత్సరాల చిన్న వయసులో తుది శ్వాస విడిచారు. కాగా, మధుబాల బయోపిక్‌ రానుంది. గత ఏడాది మార్చిలో ఈ బయోపిక్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటించిన ‘డార్లింగ్స్‌’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన జస్మీత్‌ కె. రీన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

సోనీ పిక్చర్స్‌ ఇంటర్‌నేషనల్‌ ప్రోడక్షన్స్‌ సంస్థతో బ్రిజ్‌ భూషణ్‌ (మధుబాల సోదరి) మధుబాల బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో మధుబాలగా ఆలియా భట్‌ లేదా ‘యానిమల్‌’ ఫేమ్‌ త్రిప్తి దిమ్రీ నటించనున్నారని టాక్‌. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనీష్‌ మల్హోత్రా కూడా మధుబాల బయోపిక్‌ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో మధుబాలగా కృతీ సనన్‌ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ మనీష్‌ మల్హోత్రా నిర్మించే మధుబాల బయోపిక్‌పై తమకు సమాచారం లేదన్నట్లుగా బ్రిజ్‌ భూషణ్‌ ఓ సందర్భంలో వెల్లడించారనే వార్తలు బాలీవుడ్‌ ఉన్నాయి.

ట్రాజెడీ క్వీన్‌ 
దివంగత ప్రముఖ నటి, ట్రాజెడీ క్వీన్‌గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్‌ ఔర్‌ మీనా’ అనే సినిమా రానుంది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో ఈ సినిమా ప్రారంభం కాలేదు. తొలుత ‘కమల్‌ ఔర్‌ మీనా’ చిత్రానికి మనీష్‌ మల్హోత్రా దర్శకత్వం వహిస్తారనే టాక్‌ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీకి దర్శకుడిగా సిద్ధార్థ్‌. పి మల్హోత్రా ఉన్నారు. అలాగే ఈ ‘కమల్‌ ఔర్‌ మీనా’లో మీనా కుమారిగా తొలుత కృతీ సనన్‌ పేరు వినిపించింది.

కానీ ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని దర్శకుడు కమల్‌ అమ్రోహిగా ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావు వంటి హీరోల పేర్లు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయట. అయితే ఈ అంశాలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ ఏడాది జూలైలో కియారా అద్వానీ ఓ పాపకు జన్మనిచ్చారు. దీంతో కియారాకు సెట్స్‌కు వచ్చేందుకు వీలుపడదు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని బాలీవుడ్‌ సమాచారం. అమ్రోహీ ఫ్యామిలీతో కలిసి సిద్ధార్థ్‌. పి. మల్హోత్రా, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.

ది అన్‌టోల్డ్‌ స్టోరీ 
గ్లామరస్‌ క్వీన్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్‌ స్మిత. ఆ తరం స్టార్‌ హీరోల సినిమాల్లో ఎన్నో స్పెషల్‌ సాంగ్స్‌ చేశారు. అయితే సిల్క్‌ స్మిత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నారామె. ఎవరూ ఊహించని రీతిలో 1996 సెప్టెంబరు 23న సిల్క్‌ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్‌’ అనే సినిమా వచ్చింది.

విద్యాబాలన్‌ టైటిల్‌ రోల్‌ చేసిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగానే మరో సినిమా రానుంది. ‘సిల్క్‌ స్మిత: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’గా వస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో సిల్క్‌ స్మితగా చంద్రికా రవి నటిస్తున్నారు. ఈ మూవీతో జయరామ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.  
ఇలా సినిమా తారల జీవితాల ఆధారంగా రూపొందనున్న మరికొన్ని బయోపిక్స్‌ చర్చల దశల్లో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement