
పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన దంపతులకు మెగా గారాలపట్టి క్లీంకార పుట్టింది. అయితే పుట్టి ఏడాది దాటిపోయినా సరే ఇప్పటికీ చిన్నారి ముఖాన్ని బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉందని, కావాలనే ఇలా ఫేస్ కవర్ చేస్తున్నామని ఉపాసన చెప్పుకొచ్చింది. తాజాగా ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొన్న ఈమె.. కూతురు క్లీంకార గురించి మాట్లాడింది. అలానే తనని ట్యాగ్స్ పెట్టి పిలవడంపైనా స్పందించింది.
'ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది దానికి తోడు కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా మమ్మల్ని భయపెట్టాయి. మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేటప్పుడు పాప ముఖానికి మాస్క్ వేస్తుంటాం. చెప్పాలంటే ఇది పాపకు తల్లిదండ్రులుగా నాకు, చరణ్‌కి పెద్ద పని. అయితే మేం కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది మాకు తెలీదు. కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో రామ్, నేను సంతోషంగానే ఉన్నాం.' అని ఉపాసన చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)
అలానే స్టార్ హీరోకు భార్య అనే ట్యాగ్ గురించి మాట్లాడిన ఉపాసన.. సానుకూలంగానే స్పందించింది. 'నన్ను ఎలాంటి ట్యాగ్‌తో పిలిచినా ఇష్టమే. ఎవరైనా మనకు ఓ ట్యాగ్ ఇచ్చారంటే వాళ్లు మనల్ని ఇష్టపడుతున్నట్లే కదా. ఈ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. అలానే ఇది ఓ బాధ్యత కూడా' అని చెప్పింది.
ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' సినిమాతో వచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఉపాసన విషయానికొస్తే.. తల్లిగా క్లీంకారని చూసుకుంటూనే మరోవైపు ఆస్పత్రి వ్యవహారాలు చూసుకుంటోంది. ఈ మధ్యే ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్‌గానూ ఉపాసనని నియమించారు. ఇలా పలు పనులు చేస్తూనే తల్లిగానూ క్లీంకారని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు)