
'వారసత్వం వల్లో, నేను ఒకరిని పెళ్లి చేసుకోవడం వల్లో ఈ స్థాయికి రాలేదు, నా స్వశక్తితో ఎదిగాను' అంటోంది రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Kamineni Konidela). 'ద ఖాస్ ఆద్మీ' పార్టీ పేరిట తన ఆలోచనలను సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. సంపద, హోదా, విజయం, పాపులారిటీ.. ఏది మనల్ని గొప్పవారిని చేస్తుంది? అంతర్గత లక్షణాలైన భావోద్వేగాలపై స్పష్టత, ఇతరులకు సాయం చేసే గుణం గొప్పవారిని చేస్తాయా? దీనికి ఎక్కడా సరైన సమాధానం ఉండదు. ఎవరికి వారే తమలోనే సమాధానం వెతుక్కోవాలి. నిన్ను నువ్వు నమ్మడం, నిన్ను నువ్వు ప్రేమించి, నీకంటూ విలువ ఇచ్చుకోవడం అన్నింటికన్నా ముఖ్యం అని నా అభిప్రాయం.
సమాజం ప్రోత్సహించదు
సమాజం ఎప్పుడూ ఆడవారిని వినయంతో మసులుకోమనే చెప్తుంది. ఏదైనా సరే.. మనవంతు వచ్చేవరకు ఆగమంటుంది. నిస్వార్థంగా ఉండటమే మంచిదని చెప్తుంది. పెద్ద కలలు కనేందుకు ఎంకరేజ్ చేయదు. మనం ఎదగడానికి ప్రోత్సహించదు. అయినా నేను మంచి స్థాయిలో నిలబడ్డాను. దీనికి నా కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం కారణం కాదు. అలాగే రామ్‌చరణ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ నిలబడలేదు. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించాను.
కిందపడ్డ ప్రతిసారి లేచా..
ఎలాగైనా సరే, జీవితంలో ఎదగాలని తాపత్రయపడ్డాను, పాటుపడ్డాను. కొన్నిసార్లు నాపై నాకే అనుమానం వేసేది. కిందపడ్డ ప్రతిసారి మళ్లీ లేచి నా ప్రయాణాన్ని ప్రారంభించాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. అసలైన బలం ఆత్మగౌరవంలోనే ఉంది. దానికి డబ్బు, హోదా, కీర్తితో సంబంధం లేదు. అహంకారం గుర్తింపును కోరుతుంది. కానీ ఆత్మగౌరవం.. నిశ్శబ్ధంగా గుర్తింపును సృష్టిస్తుంది అని ఉపాసన రాసుకొచ్చింది.
చదవండి: ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్