
తన ప్రత్యేకమైన స్టయిల్, స్వతంత్ర భావనతో ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించే మాళవిక మోహనన్ త్వరలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందనుంది. ఆ విషయాలే మీకోసం..
రాజాసాబ్ బ్యూటీ..
మాళవిక మోహనన్ (Malavika Mohanan) కొన్ని తమిళ, మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తాజాగా ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలో నాయికగా నటించడంతో ఆమెకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చేసింది. మాళవిక తండ్రి కె.యు. మోహనన్ కూడా సినీరంగానికే చెందినవాడు. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘తలాష్’, ‘ఫక్రే’ వంటి ఎన్నో సినిమాలకు కెమెరా బాధ్యతలు నిర్వహించారు.
తండ్రితో లొకేషన్‌కి..
మాళవిక.. కేరళలోని పయ్యనూర్ అనే గ్రామంలో జన్మించింది. అయితే చిన్నప్పటి నుంచి ముంబైలోనే పెరిగింది, చదువుకుంది కూడా అక్కడే. కేవలం చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది కాని, అసలు ఆసక్తి సినిమాలవైపే! ఒకసారి తండ్రి మోహనన్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుండగా, ఆమె లొకేషన్‌కు వెళ్లింది. ఆ యాడ్‌లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు.
ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఆసక్తి
ఆమె నటనపై చూపిన ఆసక్తిని గమనించిన మమ్ముట్టి, తన కుమారుడు దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం ఇప్పించారు. అలా మాళవిక కెరీర్ మొదలైంది. ‘పట్టమ్ పొలే’ అనే మలయాళ చిత్రం ఆమె మొదటి సినిమా. ఆ సినిమా సమయంలో కాస్ట్యూమ్స్ డిజైనర్ అనారోగ్యం కారణంగా పని చేయలేకపోయారు. దాంతో మాళవిక తన దుస్తులను తానే డిజైన్ చేసుకుంది. అక్కడి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి పెరిగి, ‘ది స్కార్లెట్ విండో’ అనే పేరుతో తన బ్రాండ్ ప్రారంభించింది.

ధైర్యం ఎక్కువే!
మాళవిక చాలా ధైర్యంగా ఉండే అమ్మాయి. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పెడుతుంటే, కొందరు నెటిజన్లు తప్పుడు కామెంట్లు పెట్టారు. మర్యాదగా, పద్ధతిగా ఉండాలని సూచనలు ఇచ్చారు. దానికి స్పందనగా పద్ధతిగా చీర వేసుకున్న ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో కూడా షార్ట్, చిన్న చొక్కా ఉండడంతో మరింత సెన్సేషన్ అయింది. ‘ఒక ఆడపిల్ల ఏ బట్టలు వేసుకోవాలో, ఎలా ఉండాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరి పని వారు చూసుకుంటే బెటర్’ అని కౌంటరిచ్చింది.
విజయ్ దేవరకొండతో మూవీ
భవిష్యత్తులో డైరెక్టర్ లేదా సినిమాటోగ్రాఫర్‌గా మారాలనేది ఆమె ఆశ. రింగులు అంటే మాళవికకి చాలా ఇష్టం. వందల సంఖ్యలో రింగులు కలెక్ట్ చేసింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – తెలుగులో ఆమెకి వచ్చిన మొదటి అవకాశం ‘రాజా సాబ్’ సినిమా కాదు. మొదట విజయ్ దేవరకొండ సినిమా కోసం ఎంపికైంది. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆ సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు ‘హీరో’.
తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకం
సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే మాళవికకి విపరీతమైన అభిమానం. ఆయనతో ‘పేట’ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎంతో థ్రిల్ అయ్యిందట! అలాగే విజయ్‌తో ‘మాస్టర్’ సినిమాలో కూడా నటించింది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రత్యేకమని మాళవిక చెప్పింది. ‘ఒక్క సినిమాలో కనిపించినా చాలు – తెలుగు వారు ఎంతగానో ప్రేమిస్తారు. అలా అభిమానించే ప్రేక్షకులు మరే భాషలో ఉండరని నాకు అనిపిస్తుంది’ అని చెప్పింది.
ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్
ప్రభాస్‌తో పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ – ‘షూటింగ్ మొదలైన వారం రోజుల్లోనే ప్రభాస్ ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం వచ్చేది. దాదాపు ముప్పై నుంచి నలభై మంది తినగలిగేంత పెద్ద పరిమాణంలో వంటలు వచ్చేవి. భోజనం బాగా నచ్చినా, అంత తినలేకపోయా’ అని తెలిపింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ – మాళవిక చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే బిల్డింగ్‌లో పెరిగారు. అందుకే తనకి అత్యంత సన్నిహితుడిగా విక్కీని భావిస్తానని చెబుతుంది. మలయాళ అమ్మాయి అయిన మాళవికకి మట్టి పాత్రలో వండే చేపల కూర అంటే విపరీతమైన ఇష్టం. డైటింగ్‌ను పక్కనపెట్టి, షూటింగ్ లేనప్పుడు తల్లి బీనా చేత వండించుకుని, ఆ చేపల కూర తింటూ ఆనందపడుతూ ఉంటుంది.
చదవండి: ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా