
కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)ది కృష్ణా జిల్లా.. కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడి తెలంగాణ యాస చూసి ముచ్చటపడ్డారు. తన సినిమాల్లో అదే యాసతో అటు కామెడీ, ఇటు విలనిజం పండించి మరింత పాపులర్ అయ్యారు. ఈయన 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో వెండితెరపై తన ప్రయాణాన్ని ఆరంభించారు. చిరంజీవి సినీజర్నీకి కూడా ఈ సినిమానే నాంది పలికింది.
ఆ నటుడి సలహా వల్లే..
అయితే కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు బ్యాంకులో గుమాస్తాగా పనిచేసేవారు. అప్పటినుంచే ప్రముఖ నటుడు మురళీ మోహన్‌తో కోటకు పరిచయం ఉండేది. సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చేయాలా? లేదా బ్యాంకు ఉద్యోగం చేయాలా? అని కోట శ్రీనివాసరావు సందిగ్ధంలో పడ్డారు. ఏది సెలక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదని మురళీమోహన్ (Murali Mohan)ను అడిగారు. అప్పుడాయన.. సినిమాల్లో నటించమని సూచించారు. సినిమాల్లో నటిస్తూ ప్రతి పారితోషికంలో సగం డబ్బు దాచుకోమని సలహా ఇచ్చారు.
ఫుల్ టైమ్ నటుడిగా..
ఒకవేళ అవకాశాలు రాకపోతే ఆ దాచిన డబ్బే ఉపయోగపడుతుందని చెప్పారు. ఆయన ఇచ్చిన సలహాతో కోట శ్రీనివాసరావు ధైర్యం చేసి బ్యాంక్ ఉద్యోగం మానేసి ఫుల్ టైమ్ నటుడిగా బిజీ అయ్యారు. అహ నా పెళ్లంట చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. పాపులారిటీతో పాటు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయితే మురళీ మోహన్ ఇచ్చిన డబ్బుతోనే కోట తొలిసారి విమానం ఎక్కారట!
(చదవండి: 30 ఏళ్లపాటు కోటను గుర్తుపట్టని భార్య.. కూతురిని రిక్షా గుద్ది, కొడుకేమో.. ఒంటరిగా కన్నీళ్లు!)
చేదు సంఘటన
ఇకపోతే కెరీర్ తొలినాళ్లలో మండలాధీశుడు సినిమా వల్ల ఏడాదిపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలో మండలాధీశుడు సినిమా తీశారు. అందులో నేను రామారావు వేషం వేశాను. ఈ సినిమా తర్వాత నేను మా పెద్దమ్మాయిని చూసేందుకు విజయవాడ వెళ్లాను. అదే సమయంలో ఎన్టీఆర్.. రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఆయన్ను చూసేందుకు వచ్చిన అభిమానులు నన్ను కిందపడేసి కొట్టారు. ఎన్టీఆర్‌ను కలిసే సాహసం చేయొద్దని నన్ను వారించారు. ఓసారి ఎయిర్‌పోర్టులో ఆయన్ను కలిశాను.
భుజం తట్టిన ఎన్టీఆర్
మీరు మంచి కళాకారులని విన్నాను, ఆరోగ్యం జాగ్రత్త అంటూ నా భుజం తట్టారు. వెంటనే ఆయన కాళ్లపై పడి నమస్కరించాను అని చెప్పుకొచ్చారు. అయితే బాలకృష్ణ మాత్రం తనను దారుణంగా అవమానించారని బాధపడ్డారు. రాజమండ్రిలో ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నప్పుడు బాలకృష్ణ కనిపించారు. నమస్కారం బాబు అని గౌరవంగా పలకరించాను. కానీ, ఆయన కాండ్రించి ముఖంపై ఉమ్మేశాడు. ఇది ఆయన సంస్కారం.. ఏం చేస్తాం? ఇలాంటి ఘటనలు మర్చిపోలేను అని తన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఆ మధ్య కోట బతికుండానే చనిపోయారంటూ వదంతులు సృష్టించడంపైనా ఆయన మండిపడ్డారు. డబ్బు కోసం ఇలాంటి రూమర్స్ రాయొద్దని కోరారు.