
లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇక సెలవంటూ దివికేగారు. ఆదివారం (జూలై 13న) ఉదయం తుదిశ్వాస విడిచారు. మహా ప్రస్థానంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కోట ఇక లేరన్న వార్తతో చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిరంజీవి, రాజేంద్రప్రసాద్, బాబూ మోహన్, బ్రహ్మానందం, అల్లు అరవింద్.. తదితర సెలబ్రిటీలు కోట పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నారు.
ఏడ్చేసిన బ్రహ్మానందం
ఈ క్రమంలో కోట భౌతిక కాయాన్ని చూసి ఆయన స్నేహితుడు, కమెడియన్ బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోట మహానటుడు. మేమిద్దరం కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేశాం. ఒక దశకంలో.. నేను, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ ప్రతి సినిమాలో ఉండేవాళ్లం. రోజుకు 20 గంటలవరకు పని చేసేవాళ్లం.
కోట లేడంటే నమ్మలేకపోతున్నా..
అరేయ్, ఒరేయ్ అనుకునేవాళ్లం. ఈరోజు కోట లేడు అంటే నమ్మలేకపోతున్నా.. నటన ఉన్నంతకాలం కోట ఉంటాడు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇండస్ట్రీకి, ఈ దేశానికే తీరని లోటు అని చెప్తూ బ్రహ్మానందం ఒక్కసారిగా ఏడ్చేశారు.
చదవండి: Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?