తెర వెనుక గాయం.. అయినా తగ్గేదే లే | Tollywood stars who got injured during shoots but continued filming | Sakshi
Sakshi News home page

తెర వెనుక గాయం.. అయినా తగ్గేదే లే

Jul 25 2025 4:08 AM | Updated on Jul 25 2025 6:58 AM

Tollywood stars who got injured during shoots but continued filming

వెండితెరపై హీరోలు కావొచ్చు లేదా హీరోయిన్లు కావొచ్చు... విలన్లను, రౌడీ మూకలను రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు ఆ కిక్కే వేరు. కొన్ని సన్నివేశాల కోసం ఎత్తైన ప్రదేశాల నుంచి దూకడం, వాహనాలపై నుంచి జంప్‌ చేయడంతో పాటు పలు రిస్కీ సన్నివేశాలకు సై అంటుంటారు కథానాయకులు. అయితేపోరాట సన్నివేశాల్లో కొందరు డూప్స్‌ని వాడుతుంటారు. మరికొందరైతే రియాలిటీ కోసం డూప్‌లను కాదని స్వయంగా వారే యాక్షన్  సన్నివేశాల్లో పాల్గొంటుంటారు.

అయితే ఆపోరాట సన్నివేశాల చిత్రీకరణ అన్నది ఆషామాషీ కాదు... ఎలాంటి గాయాల బారిన పడకుండా ఫైట్‌ సీన్స్ పూర్తి చేయడం అనేది నటీనటులతో పాటు స్టంట్‌మేన్, ఫైటర్స్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణులందరికీ ఓ సవాల్‌ లాంటిదే. షూటింగ్‌ సమయంలో నటీనటులకు గాయాలు సాధారణమే అయినప్పటికీ, కొన్నిసార్లు అవి తీవ్రంగా కూడా ఉంటాయి. ఈ కారణంగా వైద్యుల సూచనల మేరకు కొన్ని నెలల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తుంది యాక్టర్స్‌కి. చిన్న బ్రేక్‌ తర్వాత ‘అయినా తగ్గేదే లే’ అంటూ... మళ్లీ లొకేషన్‌లో ఫైట్స్‌లో విజృంభిస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి గాయాల బారిన పడిన నటీనటుల గురించి ఓ లుక్కేద్దాం.

కాలికి గాయం
హీరో ప్రభాస్‌ వరుస పాన్  ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ‘ది రాజా సాబ్‌’, ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), ‘స్పిరిట్‌’ వంటి చిత్రాలున్నాయి.  ‘సీతారామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్‌ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్  ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో ప్రభాస్‌ కాలికి గాయం అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 1945 నాటి బ్రిటిష్‌ పాలన నేపథ్యంలో సాగే ఈ చిత్రకథలో ప్రభాస్‌ బ్రిటిష్‌ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నారట.

దేశభక్తి, త్యాగం ఇతివృత్తాలుగా భారతదేశ స్వాతంత్య్రపోరాటం నేపథ్యంలో ఈ స్క్రిప్ట్‌ని తీర్చిదిద్దారట హను. మిలటరీ ఆఫీసర్‌ రోల్‌ కావడంతో ఇందులో యాక్షన్  సీక్వెన్స్ ఎక్కువగా ఉన్నాయట. అందులో భాగంగానే డూప్‌ లేకుండాపోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్న సమయంలో గత డిసెంబరులో ప్రభాస్‌ కాలికి గాయమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఇటలీకి వెళ్లి అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు అక్కడే విశ్రాంతి తీసుకుని, ఇండియా తిరిగొచ్చారని టాక్‌. ఈ చిత్రంలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే... ప్రభాస్‌ నటిస్తోన్న ‘ది రాజా సాబ్‌’ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నో డూప్‌...
బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరైన షారుక్‌ ఖాన్  నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌’. ఈ సినిమాకి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పఠాన్ ’ (2023) వంటి భారీ హిట్‌ తర్వాత షారుక్, సిద్ధార్థ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘కింగ్‌’. ఈ మూవీలో దీపికా పదుకోన్, రాణీ ముఖర్జీ, అనిల్‌ కపూర్, జాకీ ష్రాఫ్‌లతో పాటు షారుక్‌ ఖాన్  కుమార్తె సుహానా ఖాన్  కీలక పాత్రలుపోషిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్, మమతా ఆనంద్, షారుక్‌ ఖాన్, గౌరీ ఖాన్  నిర్మిస్తున్నారు. ‘కింగ్‌’ సినిమా కోసం ముంబైలోని గోల్డెన్  టొబాకో స్టూడియోలో వేసిన అతి పెద్ద సెట్‌లో భారీ యాక్షన్  సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌.

అందులో భాగంగా ఓ యాక్షన్  సీన్ లో షారుక్‌ ఖాన్  గాయపడ్డారని సమాచారం. రియాలిటీ కోసం ఆ సన్నివేశంలో డూప్‌ లేకుండా పాల్గొన్నారట షారుఖ్‌. ఆ సమయంలోనే గాయపడ్డారనే వార్తలు బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేశాయి. అంతేకాదు... కండరాల నొప్పికి సంబంధించిన అత్యవసర వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్లారనే వార్తలు కూడా ఆన్ లైన్  వేదికగా చక్కర్లు కొట్టాయి. అయితే షారుక్‌ ఖాన్ కి గాయాలయ్యాయనే విషయంపై ఇటు ఆయన టీమ్‌ నుంచి కానీ, అటు ‘కింగ్‌’ చిత్రయూనిట్‌ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ‘పఠాన్ ’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత షారుక్, సిద్ధార్థ్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘కింగ్‌’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు, ప్రేక్షకుల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది.

కుడిచేతికి గాయం
చేతినిండా వరుస సినిమాలతో దూసుకెళుతుంటారు హీరో రవితేజ. ఆయన నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్‌ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్  ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో కీలకమైన ఓ యాక్షన్  సన్నివేశం చిత్రీకరిస్తుండగా గత ఏడాది ఆగస్టులో రవితేజ కుడి చేతికి గాయమైంది.

అయితే తన గాయం కారణంగా షూటింగ్‌కి బ్రేక్‌ పడకూడదని చిత్రీకరణలో పాల్గొన్నారట రవితేజ. కానీ, నొప్పి తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళ్లారాయన. చిన్నపాటి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చె΄్పారు. ఈ గాయం నుంచి కోలుకున్నాక ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘మాస్‌ జాతర’ని మే 9న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ తొలుత ప్రకటించింది. అయితే వాయిదా వేసి ఆగస్టు 27న రిలీజ్‌ చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్‌.

వారం విశ్రాంతి
వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో కార్తీ. ‘ఆవారా, యుగానికి ఒక్కడు, ఊపిరి, ఖైదీ, సర్దార్‌’ వంటి  చిత్రాలతో తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. ‘సర్దార్‌ 2’ చిత్రం షూటింగ్‌లో ఆయన ఓ ఫైట్‌ సీన్  చిత్రీకరణలో గాయపడ్డారు. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్‌ మిత్రన్  కాంబినేషన్ లో రూపొందిన ‘సర్దార్‌’ చిత్రం 2022లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వీరి కాంబినేషన్ లోనే ‘సర్దార్‌ 2’ తెరకెక్కుతోంది.

ఈ మూవీలో మాళవికా మోహనన్ , ఆషికా రంగనాథ్, రజీషా విజయన్  హీరోయిన్లుగా, ఎస్‌జే సూర్య విలన్ గా నటిస్తున్నారు. ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్, ఇషాన్  సక్సేనా నిర్మాతలు. మైసూరులో ‘సర్దార్‌ 2’ షూటింగ్‌లో భాగంగా ఈ ఏడాది మార్చిలో కీలకమైన ఓ యాక్షన్  సీన్  తీస్తుండగా కార్తీ కాలికి గాయమైంది. దీంతో ఆయన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా... పెద్ద ప్రమాదం ఏమీ లేదని.. జస్ట్‌ వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ మూవీ షూటింగ్‌ ఆపేసి చెన్నై వెళ్లి΄ోయారు కార్తీ. విశ్రాంతి తర్వాత ‘సర్దార్‌ 2’ షూటింగ్‌ పూర్తి చేశారు.

మెడకు గాయం...
‘మర్డర్, ఆషిక్‌ బనాయా ఆప్నే, మర్డర్‌ 2’ వంటి చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్  హష్మీ. హిందీలో వరుస సినిమాలు చేసిన ఆయన పవన్‌కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్  పాత్ర చేస్తున్నారు. 

మరోవైపు అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘జీ2’ (గూఢచారి 2’) చిత్రంలోనూ ఇమ్రాన్  హష్మీ ప్రధాన పాత్రపోషిస్తున్నారు. వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం గత ఏడాది అక్టోబరులో హైదరాబాద్‌ వచ్చారు ఇమ్రాన్ . ఓ యాక్షన్  సీన్ లో భాగంగా పై నుంచి దూకుతున్న క్రమంలో ఆయన మెడకు గాయమైంది. అయితే షూటింగ్‌ ఆగకూడదని ప్రథమ చికిత్స అనంతరం చిత్రీకరణలో పాల్గొన్నారు ఇమ్రాన్ .

ముఖానికి గాయాలు
బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ప్రియాంకా చోప్రా. 2018లో అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను పెళ్లి చేసుకొని తన మకాంను హాలీవుడ్‌కి మార్చేశారామె. హాలీవుడ్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ‘ది బ్లఫ్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం షూటింగ్‌లో ఆమె గాయపడ్డారు. ఫ్రాంక్‌ ఇ. ఫ్లవర్స్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్రపోషిస్తున్నారు. ఈ సినిమా కోసం గత ఏడాది జూన్ లో ఆస్ట్రేలియాలో ప్రియాంకా చోప్రాపై ఓ యాక్షన్  సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది.

ముఖ్యంగా ముఖంపై గాయాలు అయ్యాయి. ఆమె పెదవి, ముక్కు, మెడకు దెబ్బలు తగిలాయి. ఆ ఫొటోలను ఆమె స్వయంగా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి, ప్రోఫెషనల్‌ లైఫ్‌లో జరిగే ప్రమాదాలు’ అంటూ క్యాప్షన్  ఇచ్చారు. ఇక ప్రియాంక గాయపడటంతో వెంటనే చిత్రయూనిట్‌ షూటింగ్‌ ఆపేసి.. ఆమెను సిడ్నీలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి ‘ది బ్లఫ్‌’ షూటింగ్‌లో పాల్గొన్నారు ప్రియాంక. ఇదిలా ఉంటే.. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ సినిమాలో ప్రియాంక ఓ కీలక పాత్రపోషిస్తున్న సంగతి తెలిసిందే.

చేతులకు, కాళ్లకు గాయాలు...  
అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్‌’. షానియల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రపోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియన్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందుతోన్న ‘డెకాయిట్‌’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్న సమయంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుందట. ఈ ఘటనలో అడవి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ ప్రమాదవశాత్తు కింద పడటంతో చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయట.

అయితే చిత్రీకరణకు ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతో సెట్స్‌లోనే ప్రథమ చికిత్స అనంతరం వారిద్దరూ షూటింగ్‌ను కొనసాగించి తమ సన్నివేశాలను పూర్తి చేశారని టాక్‌. అయితే ఈ ప్రమాదంపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే... ఈ సినిమా కోసం మదనపల్లె యాసలో డైలాగులు చెబుతున్నారు అడివి శేష్‌. ‘డెకాయిట్‌’ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న విడుదల కానుంది.  

గాయాలను లెక్క చేయకూడదు 
‘ఊహలు గుసగుసలాడే, బెంగాల్‌ టైగర్, సుప్రీమ్, ప్రతిరోజూ పండగే, తొలి ప్రేమ’ వంటి పలు హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రాశీ ఖన్నా. ఆమె నటిస్తున్న తాజా వెబ్‌ సిరీస్‌ ‘ఫర్జీ 2’. విజయ్‌ సేతుపతి, షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఫర్జీ 2’ షూటింగ్‌లో భాగంగా ఈ ఏడాది మేలో రాశీ ఖన్నా గాయపడ్డారు. కథ డిమాండ్‌ మేరకు రిస్కీ  యాక్షన్‌ సీన్స్‌లో ఆమె పాల్గొనగా ప్రమాదవశాత్తు స్వల్పంగా గాయపడ్డారు.

అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ‘‘కథ డిమాండ్‌ చేస్తే గాయాలను కూడా లెక్క చేయకూడదు. మన గాయాలు కూడా ఒక్కోసారి మన శరీరం, శ్వాస మీద ప్రభావం చూపవచ్చు. మనమే ఒక తుపాను అయినప్పుడు మనల్ని ఏ పిడుగు ఆపలేదు’’ అంటూపోస్ట్‌ చేశారు రాశీ ఖన్నా. ‘ఫర్జీ’ తొలి సిరీస్‌కి మంచి స్పందన రావడంతో ‘ఫర్జీ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో పవన్‌ కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, సిద్ధు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement