
టైటిల్: 1000 వాలా
నటీనటులు: అమిత్, సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ తదితరులు
దర్శకుడు: అఫ్జల్
నిర్మాత: షారూఖ్
నిర్మాణ సంస్థ: సూపర్ హిట్ మూవీ మేకర్స్
విడుదల తేదీ: మార్చి 14, 2025
యువ నటుడు అమిత్ హీరోగా నటించిన తాజా చిత్రం '1000 వాలా'. ప్రముఖ సీనియర్ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అఫ్జల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ఈ చిత్రం ఈ మార్చ్ 14 న థియేటర్లలోకి వచ్చింది. సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే..
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అర్జున్(అమిత్ డ్రీం స్టార్) తన తాతయ్య వద్ద పెరుగుతూ ఉంటాడు. నటుడు కావాలనేది అతని కల. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కోరిక తీరదు. అయితే తన స్నేహితుడు బుజ్జి తండ్రి(పిల్ల ప్రసాద్) తన స్నేహితుడు హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చాడని తెలుసుకుని అర్జున్‌ను అక్కడికి రమ్మంటాడు. ఎలాగైనా అతన్ని మంచి నటుడిని చేయమని బుజ్జి తండ్రి అతని స్నేహితుడికి చెబుతాడు. అయితే అతను అర్జున్‌ను చూడగానే షాక్ అవుతాడు. వెంటనే అతన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని హైదరాబాద్‌కు తీసుకెళ్తాడు. అక్కడ భవాని ప్రసాద్(ముక్తార్ ఖాన్)ను కలుస్తాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు(సుమన్) అర్జున్‌తో సినిమా నిర్మిస్తానని చెబుతాడు. ఈ క్రమంలోనే అర్జున్.. తన హీరోయిన్ శైలుతో ప్రేమలో పడతాడు. ఆమె అర్జున్‌కి లవ్ ప్రపోజ్ చేయాలనుకున్న టైంలో ... అతనికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. చనిపోయిన అమిత్ ప్లేస్‌లో తనని తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నారని అర్జున్‌కు అర్థమవుతుంది. మరోపక్క డేవిడ్(షారుఖ్ భైగ్) కావ్య అనే అమ్మాయిని చంపడానికి మనుషుల్ని పంపుతాడు. ఈ క్రమంలో అర్జున్ ఆమెను కాపాడతాడు. అయితే అమిత్‌ను తానే చంపేశానని అర్జున్‌కి చెప్పి ఇంకో షాక్ ఇస్తుంది కావ్య. అయితే అమిత్‌ను ఆమె ఎందుకు చంపింది. అసలు వీరి మధ్య ఏం జరిగింది? తర్వాత అర్జున్ జీవితం ఎలా మారింది అనేదే మిగిలిన కథ.
ఎలా ఉందంటే..
కమర్షియల్ కథలకి ఫ్యామిలీ సెంటిమెంట్ కలిస్తే ఎక్కువగా సక్సెస్ అవుతాయి. ఈ విషయాన్ని '1000 వాలా తో మరోసారి ప్రూవ్ చేశాడు దర్శకుడు అఫ్జల్. అతనిలో ఉన్న మాస్ ఈ సినిమాతో బయటపెట్టారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే తాత మనవళ్ల సెంటిమెంట్, ఇంటర్వెల్ ఫైట్ మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. ఇక సెకండాఫ్ వచ్చేసరికి ఫ్యామిలీ ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంది. సినిమాలో వచ్చే లాస్ట్ పాట మాస్ ఆడియన్స్‌లో ఊపేసింది. ఓవరాల్‌గా మాస్ ఆడియన్స్‌కు 1000 వాలా ఫీలింగ్ తీసుకొచ్చాడు డైరెక్టర్.
ఎవరెలా చేశారంటే...
అమిత్ డ్రీమ్ స్టార్ అటు అర్జున్‌గా.. ఇటు అమిత్‌గా రెండు షేడ్స్ కలిగిన పాత్రల్లో ఒదిగిపోయాడు. షారుఖ్ భైగ్ రూపంలో ఓ స్టైలిష్ విలన్‌గా మెప్పించారు.సీనియర్లు సుమన్, ముక్తార్ ఖాన్, పిల్లా ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర మెప్పించారు. వంశీ కాంత్ రేఖాన అందించిన సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. చందు ఏజే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.