'దయచేసి ఎవరినీ అలా జడ్జ్‌ చేయకండి..' కిరణ్ అబ్బవరం | Tollywood Hero Kiran Abbavaram Comments On Cinema Success | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: ఎవరికైనా ఒక్క శుక్రవారం చాలు: కిరణ్ అబ్బవరం కామెంట్స్

Nov 8 2024 7:13 PM | Updated on Nov 8 2024 7:24 PM

Tollywood Hero Kiran Abbavaram Comments On Cinema Success

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్‌, అమరన్‌ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ' మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. ఈ సినిమా చూడటానికి ఎవరొస్తారు. ఇప్పుడు అవసరమా..? పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకన్నారు. విడుదలకు ముందు చాలా ఇబ్బంది పడ్డా. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. ఈ క్రెడిట్ అంతా మా టీమ్‌కు ఇస్తాను. సక్సెస్, ఫెయిల్యూర్స్ నా ఒంటికి ఎక్కవు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. నేను మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలని' అన్నారు.

ఆ తర్వాత కిరణ్ మాట్లాడుతూ..'ఈ మాట చెప్పడం కాస్త తొందరపాటు అవుతుందేమో నాకు తెలియదు. దయచేసి ఎవరినీ కూడా మార్కెట్‌ పరంగా జడ్జ్ చేయకండి. వీడి మార్కెట్ ఇంత.. వాడి మార్కెట్ ఇంత.. ఇంకోడి మార్కెట్ ఇంత. ఇదంతా మార్చేయడానికి ఒక్క శుక్రవారం చాలు. ఈరోజు కింద ఉన్న వ్యక్తి వచ్చే శుక్రవారానికి టాప్‌కి వెళ్లొచ్చేమో. టాప్‌లో ఉన్న హీరో రెండు శుక్రవారాల్లో కిందకు పడొచ్చేమో. నా సినిమాను అందరూ ఆదరించారు. అందరం కలిసి మంచి సినిమా చేద్దాం' అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement