
సినిమాల్లో హిట్ కొట్టినంత ఈజీ కాదు క్రేజ్‌ని నిలబెట్టుకోవడం. స్టార్ హీరోలకు పర్లేదు, మూడు నాలుగు ఫ్లాప్స్ పడినా సరే కొత్త ప్రాజెక్టులు వస్తాయి. యంగ్ హీరోల పరిస్థితి అలా ఉండదు. మూవీ ఫెయిలైందంటే తర్వాత దినదిన గండమే. దర్శక నిర్మాతలు కూడా వీళ్లని లైట్ తీసుకుంటారు. రీసెంట్ టైంలో అలా కొందరు హీరోలు పూర్తిగా స్క్రీన్‌పై కనిపించట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఇంతకీ అలాంటి హీరోలు ఎవరు? అసలెక్కడున్నారు? ఏం చేస్తున్నారు?
(ఇదీ చదవండి: కొత్తింట్లో అడుగుపెట్టిన వరుణ్ సందేశ్-వితిక)
మెగా ఫ్యామిలీలోనే ఇద్దరు హీరోల చేతిలో ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు లేవు. 'ఉప్పెన'తో హిట్ కొట్టి, ఎంట్రీతోనే రూ.100 కోట్ల కలెక్షన్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలియదు. 'ఉప్పెన' తర్వాత మూడు మూవీస్ చేస్తే అవన్నీ ఫ్లాప్. చివరగా 2023 నవంబరులో 'ఆదికేశవ'తో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా హీరోగా ప్రయత్నిస్తున్నాడు గానీ వర్కౌట్ అవట్లేదు. గతేడాది ఆగస్టులో 'బడ్డీ' అనే మూవీతో చివరగా కనిపించాడు. అప్పటినుంచి ఇతడు కూడా సైలెంట్. ప్రస్తుతానికైతే శిరీష్.. ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తోంది.
'ఆర్ఎక్స్ 100'తో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ.. తర్వాత కూడా పలు సినిమాలు చేశాడు. మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. కారణమేంటో తెలీదు గానీ గతేడాది రిలీజైన 'భజే వాయువేగం' మూవీ తర్వాత నుంచి సైలెంట్. ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నాడని తెలుస్తోంది. మరి కొత్త మూవీ అప్‌డేట్ ఎప్పుడు ఇస్తాడో?
ప్రముఖ దర్శకనిర్మాత ఎమ్ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. 'కేరింత' ఇతడికి గుర్తింపు తీసుకొచ్చింది. కానీ తర్వాత పెద్దగా మూవీస్ వర్కౌట్ కాలేదు. దీంతో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయాడు. ప్రస్తుతానికైతే హీరోగా సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్లు కనిపించట్లేదు.
90స్‌లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ కూడా ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. ప్రస్తుతం బిజినెస్ చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు మాత్రం పోస్ట్ చేస్తుంటాడు. వీళ్లతో పాటు అల్లరి నరేశ్ సోదరుడు రాజేశ్ కూడా 'సొంతం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇతడు కూడా సినిమాలకు పూర్తిగా దూరమైపోయి, బిజినెస్‌లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది. అప్పట్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు కూడా కొన్నాళ్ల క్రితం నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్, రవితేజ సినిమాల్లో నటించాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పేసినట్లు కనిపిస్తోంది.
వీళ్లే కాదు ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచన చాలా మారిపోయింది. సమ్‌థింగ్ స్పెషల్ ఉండే సినిమాలకు మాత్రమే వస్తున్నారు. ఇలాంటి వాటినే ఆదరిస్తున్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం చాలామంది మిడ్ రేంజ్ హీరోలు కూడా రాబోయే కొన్నాళ్లలో ఇంటికే పరిమితమైపోయిన ఆశ్యర్యపోనక్కర్లేదు.
(ఇదీ చదవండి: 'కాంతార' షూట్‌లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)